కేంద్ర ఆర్థిక శాఖ కీలక సమాచారం విదేశాలకు లీక్... గూఢ‌చర్యం చేస్తున్న ఉద్యోగి అరెస్ట్

మంగళవారం నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన‌ విదేశాలకు రహస్య సమాచారాన్ని అందిస్తూ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Advertisement
Update:2023-01-19 12:00 IST

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన కీలక‌మైన సమాచారాన్ని విదేశాలకు లీక్ చేశారనే ఆరోపణలపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

నిందితుడిని సుమిత్‌గా గుర్తించారు. అతను కాంట్రాక్టు ఉద్యోగి. ఆర్థిక మంత్రిత్వ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

మంగళవారం ఆయనపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు విదేశాలకు రహస్య సమాచారాన్ని అందిస్తూ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

" ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పంపడానికి అతను ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు " అని ఆ అధికారి చెప్పాడు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్ది రోజుల్లో పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగించే అంశం.

కాగా, 2022 నవంబర్ లో విదేశాంగ శాఖలో గూఢచర్యానికి పాల్పడుతున్న ఓ డ్రైవర్ ను అరెస్టు చేశారు. విదేశాంగ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేశాడనేది అతనిపై ఆరోపణ. ఈ విధంగా కేంద్ర మంత్రి వర్గ శాఖల్లో వరస గూఢచర్య సంఘటనలు దేశభధ్రతను ప్రశ్నార్దకం చేస్తున్నాయి. 

Tags:    
Advertisement

Similar News