ఒక లెస్బియన్‌ జంట కథ

కేరళ రాష్ట్రం మలప్పురం ప్రాంతానికి చెందిన సుమయ్య, అఫీఫాకు స్కూల్ డేస్‌ నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం.

Advertisement
Update:2023-06-28 12:00 IST

ఒక లెస్బియన్‌ జంట కథ

సమాజం గీసిన చట్రాలకు బయట చట్టాలు కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తాయి. నచ్చిన వ్యక్తితో కలిసి జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఎన్నో కోర్టు తీర్పులు చెబుతున్నాయి. మేజర్‌ అయిన యువతీ, యువకులు తమకు నచ్చిన వారిని జీవిత భాగస్వాములుగా ఎంచుకోవచ్చంటున్నాయి. స్వలింగ సంపర్కులకు కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడీ హక్కును దక్కించుకునేందుకు స్వలింగ సంపర్కులైన ఇద్దరు యువతులు పెద్ద పోరాటమే చేస్తున్నారు.

కేరళ రాష్ట్రం మలప్పురం ప్రాంతానికి చెందిన సుమయ్య, అఫీఫాకు స్కూల్ డేస్‌ నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. కాలం గడిచేకొద్దీ ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. వాళ్లిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ నిర్ణయం కుటుంబ సభ్యులకు మాత్రం నచ్చలేదు. దీంతో వాళ్లు కోర్టును ఆశ్రయించారు. లెస్బియన్‌ జంట కలిసి జీవించేందుకు మలప్పురం కోర్టు అనుమతించడంతో సుమయ్య, అఫీఫా జనవరి నుంచి కలిసి ఉంటున్నారు. కానీ ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయిన అఫీఫా కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.

మే 30న తను పనిచేసే చోటు నుంచి ఆఫీఫాను ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో... సుమయ్య పోలీసులను ఆశ్రయించింది. జూన్‌ 5న కోర్టులో హెబియస్‌ కార్పస్‌ ఫైల్ చేసింది. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు జూన్‌ 9న యువతిని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. కానీ యువతి కుటుంబ సభ్యుల తరుపు న్యాయవాది జూన్‌ 19 వరకు గడువు తీసుకున్నారు. జూన్‌ 19న కోర్టు ముందు అఫీఫాను ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులతో వెళ్లడానికి తనకు అభ్యంతరం లేదని అఫీఫా చెప్పడంతో ఆమెను కుటుంబ సభ్యులతో పంపించారు.

కానీ తరువాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జూన్‌ 24, 25 తేదీల్లో తనను కోజికోడ్‌లోని ఒక ఆసుపత్రిలో వైద్యం పేరుతో బంధించారని అఫీఫా తన జీవిత భాగస్వామి సుమయ్యకు మెసేజ్‌ చేసింది. వైద్యం పేరుతో కుటుంబ సభ్యులు తనను ముందు సైకాలజిస్ట్‌ వద్దకు తీసుకెళ్లారని, అక్కడి నుంచి కోజికోడ్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారని పేర్కొంది. చట్టవిరుద్ధంగా తనకు మెడిసిన్‌ ఇస్తున్నారని, తాను ఎంత వాదించినా ఎవరికీ అర్థం కావడంలేదని మెసేజ్‌లో పేర్కొంది. తాను తప్పించుకోవాలని ప్రయత్నించినా పట్టుకున్నారని పేర్కొంది. రోజురోజుకూ మెడిసిన్‌ మోతాదు పెంచుతున్నారని ఆరోపించింది.

ఓ స్వచ్చంద సంస్థ ఫిర్యాదుతో విషయం తెలుసుకునేందుకు మలప్పురం ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఆఫీస్‌ అధికారులు కొండెట్టిలోని యువతి ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంగా... కుటుంబ సభ్యులు అధికారుల ముందే అఫీఫాపై దాడి చేశారు. అక్కడి నుంచి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అఫీఫాను బలవంతంగా తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కాగా.. ఈ విషయంలో అవసరమైతే కేసు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. జూన్‌ 19న ఆమె తన కుటుంబంతో వెళ్లేందుకు అంగీకరించిందని, కోర్టు ఆదేశాలను కాదని ఆమెను అదుపులోకి తీసుకోవడం సాధ్యం కాదనేది పోలీసుల వాదన. అఫీఫా కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్ రికార్డ్‌ చేశామని, రిపోర్ట్‌ సబ్‌ కలెక్టర్‌కు అందిస్తామని చెబుతున్నారు. అవసరాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    
Advertisement

Similar News