కీచులాట సివిల్ సర్వెంట్లపై వేటు. ఆమె భర్తకు బదిలీ దెబ్బ

ఈ ఇద్దరు మహిళా అధికారులు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండడం, మీడియాను ఆకర్షించే వ్యక్తులే కావడం, ఇదివరకు పలు వివాదాల్లో ఉండడంతో వీరి వ్యవహారం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.

Advertisement
Update:2023-02-21 19:29 IST

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ, వ్యక్తిగత ఫొటోలను కూడా షేర్ చేసుకుంటూ కర్ణాటకలో రచ్చ రేపిన ఇద్దరు మహిళా ఉన్నతాధికారులపై కర్ణాటక ప్రభుత్వం వేటు వేసింది. హోం మంత్రి వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే ఇద్దరిపైన బదిలీ వేటు పడింది. వారికి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. జీఏడిలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

వివాదానికి కారణమైన ఐపీఎస్ అధికారిణి రూప భర్తను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు మాత్రం మరోచోట పోస్టింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు రెవెన్యూ శాఖలో కమిషనర్ గా ఉన్న రూప భర్త మునీష్ ను అక్కడి నుంచి డిపిఏఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు.

ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి, ఐపిఎస్ అధికారిణి రూపకు మాత్రం పోస్టింగ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. తొలుత వివాదానికి ఐపీఎస్ అధికారి రూప కారణమయ్యారు. రోహిణి సింధూరికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆమె పోస్టులు పెట్టారు. సింధూరిపై అవినీతి ఆరోపణలు చేశారు. గతంలో ఒక ఎమ్మెల్యేతో వివాదం పెట్టుకున్న సింధూరి ఆ తర్వాత ఒక రెస్టారెంట్లో సదరు ఎమ్మెల్యేతో భేటీ అయ్యారని అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు.

ఆ తర్వాత ఏకంగా రోహిణి సింధూరికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలను కూడా రూప సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సదరు ఫొటోలను సింధూరి తన సీనియర్ ఐఏఎస్ లు అయిన ముగ్గురికి పంపించిందని, ఇలా వ్యక్తిగత ఫొటోలను అధికారులకు పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ రూప ప్రశ్నిస్తూ దూమారం రేపారు .

రూప ఆరోపణలపై సింధూరి కూడా గట్టిగా స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలోని ఫొటోలను, వాట్సాప్ స్టేటస్ లోని చిత్రాలను రూప సేకరించి వాటిని తాను ఇతర ఐఏఎస్ లకు పంపినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తోందని, నిజంగా తాను పంపి ఉంటే ఆ ఐఏఎస్ లు ఎవరో బయటపెట్టాలని సవాల్ చేశారు.

రూపపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత సింధూరి భర్త పోలీసులకు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. తన భార్య ఫోన్ హ్యాక్ చేశారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత రూప, సింధూరి ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

ఈ ఇద్దరు మహిళా అధికారులు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండడం, మీడియాను ఆకర్షించే వ్యక్తులే కావడం, ఇదివరకు పలు వివాదాల్లో ఉండడంతో వీరి వ్యవహారం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇద్దరు కీలక అధికారుల మధ్య రోజుల తరబడి నడుస్తున్న ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి చికాకు తెప్పించింది. దాంతో ఇద్దరి పైన బదిలీ వేటు వేసింది. పోస్టింగ్ ఇవ్వకుండా గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News