మహిళలను కించపరుస్తూ మంత్రి వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన కనిమొళి

ఖుష్బూ చేసిన ట్వీట్‌పై కనిమొళి తాజాగా స్పందించారు. తాను ఈ విషయమై మహిళగా, మనిషిగా బహిరంగ క్షమాపణలు చెబుతున్నట్లు చెప్పారు. ఇలాంటి పనులు ఎవరు చేసినా ఉపేక్షించబోమన్నారు.

Advertisement
Update:2022-10-28 11:15 IST

తమిళనాడులో మహిళలపై ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి చేసిన అనుచిత వ్యాఖ్యలపై డీఎంకే సీనియర్ నాయకురాలు, ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి కనిమొళి క్షమాపణలు కోరారు. మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నగరంలో మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది.

ఈ పథకం విజయవంతమై మహిళలు ప్రభుత్వ బస్సులను బాగా వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి పొన్ముడి ఓ సభలో మాట్లాడుతూ 'మహిళలు కాసింత దూరం కూడా నడవకుండా సిటీ బస్సులను ఆశ్రయిస్తూ ఓసీగా ప్రయాణిస్తున్నారంటూ' వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.

దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. ఈ విషయమై బీజేపీ సీనియర్ నాయకురాలు ఖుష్బూ ఓ ట్వీట్ చేశారు. 'మహిళలను పురుషులు దుర్భాషలాడారంటే వారు ఎలాంటి వాతావరణంలో పుట్టిపెరిగారో అర్థమవుతోంది. ఇలాంటి వ్యక్తులే మహిళల గర్భాన్ని అవమానిస్తారు. ఇదేనా ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో విరాజిల్లుతున్న ద్రవిడ సంస్కృతి? ' అని ట్వీట్ చేశారు.

ఖుష్బూ చేసిన ట్వీట్‌పై కనిమొళి తాజాగా స్పందించారు. తాను ఈ విషయమై మహిళగా, మనిషిగా బహిరంగ క్షమాపణలు చెబుతున్నట్లు చెప్పారు. ఇలాంటి పనులు ఎవరు చేసినా ఉపేక్షించబోమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని స్టాలిన్ కానీ, పార్టీ అధిష్టానం కానీ వెనకేసుకురాదని ఆమె స్పష్టం చేశారు. కాగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్ముడి ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యల పట్ల మహిళలను క్షమాపణలు కోరారు.

Tags:    
Advertisement

Similar News