బీజేపీతో పొత్తు ఎఫెక్ట్.. జేడీఎస్‌లో సంక్షోభం

ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ కాక రేపుతున్నాయి. బీజేపీతో కలసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న దేవెగౌడ పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు.

Advertisement
Update:2023-10-17 12:20 IST

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జేడీఎస్ నాయకుడు దేవెగౌడ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన జేడీఎస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా పలువురు ఎమ్మెల్యేలు దేవెగౌడ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి సొంతంగా అధికారంలోకి వచ్చే బలం లేదు. అందుకే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక ప్రధాన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తుంటుంది.

కర్ణాటకలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు సంపూర్ణ మెజారిటీ దక్కనప్పుడు జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారుతుంటుంది. అలా రెండుసార్లు దేవెగౌడ తనయుడు కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది.

ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని దేవెగౌడ నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం ఆ పార్టీ నేతలకు రుచించడం లేదు. ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. దేవెగౌడ, కుమారస్వామి బీజేపీతో వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని, తాము మాత్రం వెంట రాలేమని ప్రకటించారు. తనతో చాలామంది జేడీఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. వారందరితో సోమవారం సమావేశం అయినట్లు చెప్పారు. బీజేపీతో కలసి వెళ్లకూడదని తాము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సెక్యులర్‌గా ఉన్న తన వర్గమే అసలైన జేడీఎస్ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ కాక రేపుతున్నాయి. బీజేపీతో కలసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న దేవెగౌడ పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. దేవెగౌడ పార్టీలో నెలకొన్న వ్యతిరేకతను పట్టించుకోకుండా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    
Advertisement

Similar News