తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. - కర్నాటక ఎన్నికల నేపథ్యంలోనేనా..?
ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధర రూ.91.50 మేరకు తగ్గించడం గమనార్హం. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై ఈ తగ్గింపు అమలు కానుంది. గృహ వినియోగ సిలిండర్ ధర యథాతథంగా ఉండనుంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. కర్నాటక ఎన్నికల్లో తమకు సానుకూలత ఏర్పడాలనే ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరల తగ్గింపునకు చర్యలు తీసుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత నెలలోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.350.50 పెంచిన కేంద్ర చమురు సంస్థలు.. గృహ వినియోగ సిలిండర్ ధరను రూ.50 పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధర రూ.91.50 మేరకు తగ్గించడం గమనార్హం. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై ఈ తగ్గింపు నేటి (ఏప్రిల్ 1) నుంచే అమలులోకి రానుందని కేంద్ర చమురు సంస్థలు వెల్లడించాయి. గృహ వినియోగ సిలిండర్ ధర యథాతథంగా ఉండనుంది. ఈ తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,028కి చేరింది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 2023 మే 10న జరగనుండగా, మే 13న ఫలితాలు వెలవడనున్నాయి. 224 మంది సభ్యుల అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఇటీవల సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ఈ సర్వేలో 57 శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి పనితీరుపై జరిపిన సర్వేలో సీఎం బసవరాజ్ బొమ్మై పాలన బాగోలేదని 47 శాతం మంది చెప్పగా.. 26.8 శాతం మంది మాత్రమే బాగుందని సర్వేలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు నిర్ణయం వెలువడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.