హింసా లేక వినోదమా..? జల్లికట్టుపై ఆసక్తికర వాదనలు

మానవుల వినోదం కోసం జంతువులను హింసించడం ఎలా సమర్థనీయమని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. జంతువులను ఆట పరికరాలుగా చూసే జల్లికట్టుతో ఎద్దుల జాతుల పరిరక్షణ ఏవిధంగా సాధ్యమని ప్రశ్నించింది.

Advertisement
Update:2022-12-02 10:19 IST

జల్లికట్టు విషయంలో ప్రతి ఏటా కోర్టులు ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిందే. ఈ రాద్ధాంతం లేకుండా తాజాగా జల్లికట్టుని అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఆసక్తికర విచారణ జరిగింది. జల్లికట్టుని వినోదంగా చూడకూడదని, అది తమిళనాడు సంస్కృతి, సంప్రదాయంలో భాగమంటూ తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. జల్లికట్టు వల్ల స్థానిక ఎద్దుల జాతి పరిరక్షణ సాధ్యమవుతుందని కూడా ఆయన అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. వినోదంకోసం ఆడే క్రీడతో ఎద్దుల జాతి పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందని సూటిగా ప్రశ్నించింది.

మానవుల వినోదం కోసం జంతువులను హింసించడం ఎలా సమర్థనీయమని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. వినోదం కాదు అని వాదించడం సరికాదని, జల్లికట్టు వినోదం కాకపోతే అంతమంది ప్రజలు ఎందుకు గుమికూడతారని, వారంతా ఎద్దులను అడ్డుకునేందుకు సాహసం చేసి ఎందుకు గాయాలపాలవుతున్నారని ప్రశ్నించింది. జల్లికట్టు సమయంలో అరుపులు, కేకలతో జంతువులను హింసించడం సరికాదని చెప్పింది.

ఎద్దుల జాతులకు ఉపయోగం ఎలాగంటే..?

తమిళనాడులో జల్లికట్టు ఆడేవారు ఎద్దులను ఎంతో ప్రేమగా పెంచుతారని, ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటారని, వాటిని ప్రత్యేకంగా అలంకరిస్తారని కోర్టుకి తెలిపారు న్యాయవాది కపిల్ సిబల్. ఎద్దుల బలం, సామర్థ్యం ఆధారంగా మార్కెట్‌ లో మంచి ధర లభిస్తుందని, దీనికి జల్లికట్టే మంచి వేదిక అని చెప్పారు. ఈ వాదనతో కోర్టు విభేదించింది. జంతువులను ఆట పరికరాలుగా చూసే జల్లికట్టుతో ఎద్దుల జాతుల పరిరక్షణ ఏవిధంగా సాధ్యమని ప్రశ్నించింది. తమిళనాడు సంస్కృతిలో జల్లికట్టు భాగమని నిరూపించడానికి తగిన ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. డిసెంబర్ 6న విచారణకోసం కేసు వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News