రైల్వే గల్లా పెట్టె కళకళ.. రాయితీలడిగితే మాత్రం విలవిల

భారతీయ రైల్వే కరోనా తర్వాత బాగానే గాడిన పడింది. భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ప్రయాణికులనుంచి వచ్చే ఆదాయంలో 2022లో 71శాతం వృద్ధి నమోదైంది.

Advertisement
Update:2023-01-03 06:35 IST

కరోనా సాకుతో రైల్వేలు రాయితీలకు మంగళం పాడాయి. కనీసం వృద్ధులకిచ్చే రాయితీలు కూడా పునరుద్ధరించలేదు. పైగా రకరకాల సర్ చార్జీల మోత ఉండనే ఉంది. అయితే రైల్వేలపై అంత సింపతీ చూపించాల్సిన అవసరం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. భారతీయ రైల్వే కరోనా తర్వాత బాగానే గాడిన పడింది. భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ప్రయాణికులనుంచి వచ్చే ఆదాయంలో 2022లో 71శాతం వృద్ధి నమోదైంది.

2021తో పోలిస్తే 2022లో భారతీయ రైల్వేలకు భారీగా ఆదాయం సమకూరింది. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగిందని రైల్వే శాఖ తెలిపింది. 71శాతం మేర వృద్ధి సాధించినట్టు గణాంకాలు విడుదల చేసింది. 2022 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ప్రయాణికుల నుంచి రూ.48,913 కోట్ల ఆదాయం రైల్వే శాఖకు వచ్చింది. గతేడాది అదే కాలంలో వచ్చిన ఆదాయం కేవలం రూ.28,569 కోట్లు మాత్రమే. రిజర్వుడ్ ప్యాసింజర్ కేటగిరీలో రూ.38,482 కోట్ల ఆదాయం వచ్చిందని.. ఇది గత ఏడాదితో పోలిస్తే ఇది 56 శాతం అధికమని వెల్లడించింది.

2022 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య అన్‌ రిజర్వుడ్ ప్యాసింజర్ల నుంచి వచ్చిన ఆదాయం రూ.10,430 కోట్లు కాగా, అంతకు ముందు ఏడాది కేవలం రూ.2,169 కోట్లు మాత్రమే. 2022 ఏప్రిల్, డిసెంబర్ మధ్య రిజర్వుడ్ ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందని రైల్వే శాఖ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 59.61 కోట్ల బుకింగ్స్ జరిగాయని తెలిపింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ. 2021లో దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రయాణాలపై ఆంక్షలున్నాయి. రైళ్లు కూడా పరిమిత సంఖ్యలోనే తిరిగాయి. దీంతో రైల్వే శాఖ ఆదాయం పడిపోయింది. 2022లో అది భారీగా పెరిగింది. విచిత్రం ఏంటంటే.. ఇంత ఆదాయం పెరిగినా, ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను మాత్రం రైల్వే శాఖ పునరుద్ధరించలేదు. గత నెల పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాయితీలు పునరుద్ధరించలేమని తేల్చి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News