ప్రపంచ ఆకలి సూచీలో మరింత దిగజారిన దేశం - ప్రపంచ ఆకలి సూచీ-2023లో 111వ స్థానం
జీహెచ్‌ఐ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకలి స్థాయిని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉన్నదంటూ మండిపడింది.
ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం దారుణమైన స్థితికి పడిపోయింది. ఇది ఊరికే చెబుతున్న మాట కాదు ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్- జీహెచ్‌ఐ) 2023 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వివిధ దేశాల్లో ఆకలి స్థాయిలు, పోషకాహార లోపాలను సూచించే ఈ సూచీలో 2023 సంవత్సరానికి గానూ ఏకంగా 125 దేశాలను పరిగణనలోకి తీసుకొంటే 28.7 హంగర్ స్కోరుతో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గత ర్యాంకుతో పోలిస్తే నాలుగు స్థానాలను కోల్పోయింది. దీంతో దేశంలో పౌరులందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వటంలేదని తెలుస్తోంది.
గత కొంతకాలంగా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న పొరుగు దేశం శ్రీలంక, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పేద దేశాలుగా పిలిచే సూడాన్, రువాండా, నైజీరియా, ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు యుద్ధంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌తో పోలిస్తే భారత్ దారుణమైన ర్యాంకుకు పడిపోవడం గమనార్హం. గతేడాది ప్రపంచ ఆకలి సూచీలో 107 దేశాల జాబితాలో మన దేశం 94వ స్థానంలో నిలిచింది. అంటే ఆకలి బాధ నివారణలో గత ఏడాది 93 దేశాలు మనకన్నా అగ్రభాగాన ఉంటే.. ఈ ఏడాది అటువంటి దేశాల సంఖ్య 100కి పైగా పెరిగింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం 2030 నాటికి కూడా 47 దేశాలు తీవ్ర పోషకాహార సమస్యలు ఎదుర్కొంటాయని పేర్కొంది.
ఈ నివేదికను ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆకలి స్థాయిలు, పిల్లల్లో పోషకాహారలోపం, శిశుమరణాలు తదితర గణాంకాలు ఆధారంగా చేసుకొని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వార్షిక నివేదికను ఐర్లాండ్‌కు చెందిన కన్‌సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు ఏటా సంయుక్తంగా వెలువరిస్తాయి. ఎక్కువ స్కోర్, ర్యాంకు సాధించిన దేశంలో ఆకలి సంక్షోభం తీవ్ర రూపంలో ఉన్నట్టు పరిగణించాల్సి ఉంటుంది. అయితే, భారత్‌లో ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాల రేటు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. సరిపడా ఆహారం కారణంగా పోషకాహార లోపం వంటి ఇతర సూచికలలో భారతదేశం మెరుగుదల చూపించింది. అయితే కరోనా వైరస్, మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్, కోవిడ్ ఆంక్షలు ఈ గణాంకాల మీద తీవ్ర ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది.
జీహెచ్‌ఐ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకలి స్థాయిని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉన్నదంటూ మండిపడింది. సూచీని రూపొందించడంలో తప్పుడు విధానాలను అవలంబిస్తూ ఉన్నారని, ఇందులో ఏదో దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
♦