గ్యారంటీలు ఆర్థిక భారమే.. సీఎం సలహాదారు కామెంట్స్..!
గ్యారంటీలను కొనసాగించాలంటే ఏటా రూ.58 వేల కోట్లు అవసరమని అభిప్రాయపడ్డారు. అందుకే పథకాల నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చి సర్దుబాటు చేసే అంశంపై చర్చలు చేస్తున్నామన్నారు.
కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రకటించిన హామీలు ఇప్పుడు గుదిబండగా మారాయి. పథకాల అమలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిపోయింది. పథకాల అమలు కోసం ఏటా దాదాపు రూ.60 వేల కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి రావడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు.
ఇప్పుడు ఇదే విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారుగా ఉన్న ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారంటీలు అమలు చేయడం ప్రభుత్వానికి సవాల్‌గా మారిందన్నారు బసవరాజ్. ఈ గ్యారంటీలను కొనసాగించాలంటే ఏటా రూ.58 వేల కోట్లు అవసరమని అభిప్రాయపడ్డారు. అందుకే పథకాల నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చి సర్దుబాటు చేసే అంశంపై చర్చలు చేస్తున్నామన్నారు. గ్యారంటీలను అమలు చేయడానికి కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో వివరణ ఇచ్చుకున్నారు బసవరాజ్. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తను ఐదు గ్యారంటీలకు వ్యతిరేకంగా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. గ్యారంటీల అమలు సవాల్ అయినప్పటికీ.. హ్యాండిల్ చేస్తామని చెప్పానన్నారు. సిద్ధరామయ్య అనుభవజ్ఞుడని.. ఐదు గ్యారంటీలను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసే బడ్జెట్‌ను ఆయన రూపొందిస్తారని బసవరాజ్ చెప్పుకొచ్చారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బసవరాజ్ రాయరెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగానూ ఉన్నారు.
గతేడాది జూలైలో కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఐదు గ్యారంటీల అమలుతో అభివృద్ధి పనులు ముందుకు సాగే అవకాశాలు లేవన్నారు.