కేసీఆర్‌ కు ఫైనాన్స్‌ చేశా.. టీఆర్‌ఎస్‌ లో పని చేయలే

విజభన రాజకీయాలు ఎక్స్‌పెయిరీ మెడిసిన్‌ : ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అడ్డా కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Update:2024-11-12 21:39 IST

తాను కేసీఆర్‌ కు ఫైనాన్స్‌ చేశానే తప్ప టీఆర్‌ఎస్‌ లో పని చేయలేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలో ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అడ్డా కార్యక్రమంలో ఆయన పలు అంశాలపై స్పందించారు. తాను చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేశానని చెప్పారు. ఎన్‌డీఏ ఈసారి 400 సీట్లు సాధిస్తుందని అన్నారు కానీ 240కే పరిమితమయ్యారని చంద్రబాబు, నితీశ్ సహకారంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని, ఇది మోదీకి ఓటమేనన్నారు. ఇప్పుడు టీ20 ఫార్మాట్‌ నడుస్తుంటే కాంగ్రెస్‌ నేతలు టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్నారని.. ఇప్పుడు మార్చుకోవాల్సింది ఫార్మాట్‌ మాత్రమేనని అన్నారు. దేశంలో విభజన రాజకీయాలకు కాలం చెల్లిందని మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల్లో అది స్పష్టం కాబోతుందన్నారు. మంచి మెడిసిన్‌ కు కూడా ఎక్స్‌పెయిరీ ఉంటుందని, విభజన రాజకీయాలకు గడువు ముగిసిందన్నారు. బీజేపీ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్ధి పొందుతుందని తెలిపారు. పూల్వమా, అయోధ్య రామమందిరం ఇలా ఏదో ఒక భావోద్వేగంతో బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందన్నారు. రాజకీయాల్లోకి వస్తున్న కొత్త తరానికి త్వరగా కుర్చీ దక్కాలనే తాపత్రయం ఉంటుందని, ఈ క్రమంలోనే లెక్కలు మారుతున్నాయని తెలిపారు.

2004 నుంచి 14 వరకు కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా రాహుల్‌ గాంధీ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయినా రాహుల్‌ గాంధీ మైదానం విడిచి వెళ్లిపోలేదని దేశ ప్రజల కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 4 వేల కి.మీ.ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. దేశంలో పవర్‌ పాలిటిక్స్‌ కు గాంధీ కుటుంబం దూరంగా ఉంటుందన్నారు. విద్వేషం చిమ్ముతున్న ప్రజల్లో ప్రేమ చిగురింపజేసేందుకు రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 18 నెలల తన మనవడిని ఎల్‌కేజీలో చేర్పించాల్సి రావడం తనకే ఆశ్చర్యం వేసిందన్నారు. ఈ విధానం మారాలని, తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడమే తెలంగాణ మోడల్‌ అన్నారు. కేసీఆర్‌ సీఎంగా పదిసార్లు కూడా సెక్రటేరియట్‌ కు రాలేదని, తాను ప్రతి రోజూ సెక్రటేరియట్‌ కు వెళ్తున్నానని తెలిపారు. కేసీఆర్‌ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి రావడం లేదన్నారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండేదని, అప్పుడు గుజరాత్‌ అభివృద్ధికి కేంద్రం సహకరించిందని తెలిపారు. ఇప్పుడు మోదీ ప్రధానిగా ఉండి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్నారని, ఆయా రాష్ట్రాలను ఖతం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని జడ్జి పాత్ర పోషించాలే తప్ప ఒకరి తరపున వకాల్తా పుచ్చుకోవద్దని అన్నారు. ఐటీ, ఫార్మాలో పెట్టుబడులు పెట్టాలని అనుకునే వాళ్లు హైదరాబాద్‌ వైపునకు చూస్తారు తప్ప వాళ్లను అహ్మదాబాద్‌ కు రావాలని ఒత్తిడి చేస్తే ఎట్లా అని ప్రశ్నించారు. ఇలాంటి సంకుచిత దృష్టి దేశానికి మంచిది కాదన్నారు. మ‌హారాష్ట్ర, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుల‌కు మోదీ ఇద్ద‌తు ఇస్తే ప్ర‌తి రాష్ట్రం ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల‌ ఆర్థిక వ్య‌వ‌స్థ త‌యారు చేయ‌గ‌లదని తెలిపారు. రాష్ట్రాలు ట్రిలియన్‌ డాలర్ల సంపద సృష్టించగలిగితే ప్రధాని మోదీ పది ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేయగలుగుతారని, ఆయన గుజరాత్‌ గురించే ఆలోచిస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు.

Tags:    
Advertisement

Similar News