వయనాడ్ వరదలు - మీదే తప్పు.. కాదు మీదే తప్పు

ఇలాంటిదేదో జరగ్గానే రాష్ట్ర ప్రభుత్వంపైనే తప్పంతా నెట్టేయడం సరికాదని అమిత్‌షాపై మండిపడ్డారు పినరయి విజయన్. బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడొద్దంటూ చురకలు అంటించారు.

Advertisement
Update:2024-08-02 08:45 IST

వయనాడ్ వరద విలయం పొలిటికల్ అగ్గి రాజేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముందస్తు హెచ్చరికలు చేసినా, రాష్ట్రానికి సకాలంలో సమాచారం అందించినా, మరణాలను నివారించే అవకాశం ఉండేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వయనాడ్‌లో విపత్తు ముంచుకొస్తుందని వారం ముందే హెచ్చరించామన్నారు. అంతేకాదు కేరళ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు అమిత్‌షా.

అమిత్‌షా వ్యాఖ్యలపై సీఎం పినరయి విజయన్ సైతం అంతే ఘాటుగా స్పందించారు. వాతావరణ మార్పులను అసలు ఊహించలేమని తేల్చి చెప్పారు. గతంలో ఈ స్థాయిలో వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదన్నారు. ఇలాంటిదేదో జరగ్గానే రాష్ట్ర ప్రభుత్వంపైనే తప్పంతా నెట్టేయడం సరికాదని అమిత్‌షాపై మండిపడ్డారు పినరయి విజయన్. బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడొద్దంటూ చురకలు అంటించారు.

వయనాడ్‌లో వరద విలయం వందలాది ప్రాణాలు బలి తీసుకుంది. మృతుల సంఖ్య 300కి చేరింది. 200 మందికిపైగా గల్లంతయ్యారు. ఆర్మీ, NDRF, లోకల్ పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు గురువారం వయనాడ్‌లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

Tags:    
Advertisement

Similar News