రేపు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
మొత్తం 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు పోటీ
హర్యానా అసెంబ్లీకి రేపు ఎన్నికల పోలింగ్ జరగనున్నది. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. రెండు కోట్లకు పైగా ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం 20, 629 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో బలగాలను మోహరిస్తున్నది.
రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం హర్యానాలో ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది, బీజేపీ వరుసగా మూడవసారి అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ దశాబ్ద కాల సుదీర్ఘ విరామం తర్వాత అధికారాన్ని కైవసం చేసుకోవడానికి శ్రమిస్తున్నది. ఎన్నికల ప్రచారం సాయంత్రం 6 గంటలకు ముగియడానికి కొన్ని గంటల ముందు పోటీ ఉన్న, కీలక పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్సీ, జేజేపీ,ఆజాద్ సమాజ్ పార్టీలు ర్యాలీలు.. రోడ్‌షోలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించడానికి చివరి ప్రయత్నం చేశాయి.