ఢిల్లీని నియంత్రిస్తున్నగ్యాంగ్‌స్టర్లు

ఇక్కడ శాంతిభద్రతలు దెబ్బతింటున్నా అమిత్‌ షా మాత్రం ఎన్నికల బిజీలో ఉన్నారంటూ కేజ్రీవాల్‌ ఆగ్రహం

Advertisement
Update:2024-12-07 16:41 IST

ఢిల్లీలో జరుగుతున్న వరుస హత్యలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో ఒకేరోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హత్య ఘటనల గురించి మాట్లాడుతూ.. ఢిల్లీని గ్యాంగ్‌స్టర్లు నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ శాంతిభద్రతలు దెబ్బతింటున్నా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో వరుస హత్యలు జరుగుతుంటే అమిత్‌ షా మాత్రం ఎన్నికల బిజీలో ఉన్నారంటూ సెటైర్లు వేశారు. దేశ రాజధానిలో శాంతిభద్రతల పూర్తి బాధ్యత ఆయనదేనని అన్నారు. ఘటనలపై కేంద్రాన్ని నిలదీస్తూ నేరస్థులు ఇంత నిర్భయంగా ఎలా హత్యలకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

ఇప్పటివరకు ఢిల్లీలో జరుగుతున్న హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నప్పటికీ.. దాని వెనుక ఉన్న సూత్రధారులను మాత్రం పట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. కొన్నిరోజులుగా ఢిల్లీలోని వ్యాపారస్థులకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని.. దీనివల్ల వారంతా రాజధానిని వదిలి, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని అన్నారు. ఢిల్లీలో వ్యాపారులక, మహిళలకు, ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీస్‌ వ్యవస్థ కూడా విఫలమౌతున్నదని మండిపడ్డారు. ఇక్కడ ఓటర్లు స్కూల్స్‌, హాస్పిటల్స్‌ను చక్కదిద్దే బాధ్యతను మాకు (ఆప్‌ ప్రభుత్వం) అప్పగించారు. బీజేపీకి ఇచ్చిన ఏకైక బాధ్యత శాంతిభద్రల పరిరక్షణ మాత్రమేనని.. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేకపోతున్నదని కేజ్రీవాల్‌ అసహనం వ్యక్తం చేశారు.

శనివారం ఉదయం ఈశాన్య ఢిల్లీలోని షహదారాలో మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన సునీల్‌ జైన్‌ అనే వ్యాపారిని బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకితో కాల్చి చంపారు. మరో ఘటనలో దక్షిణ ఢిల్లీలోని గోవింద్‌పురిలో మరుగుదొడ్డి పరిశుభ్రతపై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి కత్తి పోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు ఓ కుమారుడు తన తల్లిని దారుణంగా హత్య చేశారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తమౌతున్నది.

Tags:    
Advertisement

Similar News