కొరియర్ మోసాలపై ఫెడెక్స్ ప్రకటన.. కారణమేంటో తెలుసా?
ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసులో పేరున్న ఫెడెక్స్ పేరునే ఎక్కువ మంది సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు. విదేశాల నుంచి కొరియర్ వచ్చిందని చెప్పడానికి ఇదయితే నమ్మకం కలిగించేలా ఉంటుందన్నది వారి ప్లాన్.
సైబర్ మోసాల్లో కొత్త ట్రెండ్. లాటరీలో ప్రైజ్‌లు, ఆఫర్లు అంటూ మోసగించే సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు రూట్ మార్చారు. మీ పేరున కొరియర్ వచ్చిందని, దానిలో మత్తుపదార్థాలు, నిషేధిత వస్తువులున్నందున మిమ్మల్ని అరెస్టు చేయబోతున్నామంటూ బెదిరించి, డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ కొరియర్ సంస్థ ఫెడెక్స్ ఏకంగా పేపర్లలో ప్రకటన ఇచ్చింది.
హైదరాబాద్ నగరవాసి నుంచి రూ.91 లక్షల కొట్టేశారు
సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు ‘మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు హవాలా డబ్బు వెళ్లింది’ అని బెదిరించి హైదరాబాద్ నగరానికి చెందిన ఓ 71 ఏళ్ల పెద్దాయన నుంచి రూ. 91.64 లక్షలు కాజేశారు. ఫెడెక్స్ కొరియర్ సర్వీస్‌లో మీ పేరున బ్యాంకాక్ నుంచి థాయ్‌లాండ్‌కు పంపిన పార్సిల్ అడ్రస్ సరిగాలేకపోవడంతో తిరిగి వచ్చిందంటూ కేటుగాళ్లు ఆయనకు ఫోన్ చేశారు. అందులో పాస్‌పోర్టులు, బ్యాంకు పాస్‌పుస్తకాలు, బట్టలతోపాటు 140 గ్రాముల ఎండీఎంఏ అనే మత్తుపదార్థం కూడా ఉందని, దీనిమీద కేసు నమోదయిందని ఆయన్ను బెదిరించారు.
సీబీఐ అధికారినంటూ వచ్చిన మరో కేటుగాడు
ఆ ఫోన్ అందుకుని ఆందోళన పడుతున్న ఆ పెద్దాయనకు కాసేపటికి మరో సైబర్ క్రిమినల్ వీడియో కాల్ చేసి, తాను సీబీఐ అధికారినని చెప్పాడు. మీ ఆధార్‌తో లింక్ అయిన ఉన్న బ్యాంక్ అకౌంట్ల నుంచి విదేశాలకు 66.88 మిలియన్ల డాలర్ల హవాలా డబ్బు వెళ్లిందని, ఇందులో కొంత మొత్తం బ్యాంకాక్ పోలీసులు సీజ్ చేశారని చెప్పాడు. మీపై కేసు నమోదైందని, ఏక్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశముందని బెదిరించాడు.
సీబీఐ అకౌంట్‌కు బదిలీ చేయమని డబ్బులు కొట్టేశారు
మీ అకౌంట్లలో ఉన్న డబ్బు ఏయే మార్గాల్లో వచ్చిందో పరిశీలించి, సీబీఐ అధికారులు ఓ సర్టిఫికెట్ ఇస్తారని ఆ పెద్దాయనను నమ్మించాడు. అందుకోసం మీ దగ్గర ఉన్న డబ్బును సీబీఐ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పాడు. ఈ విషయమే మీకు సీబీఐ నుంచి లెటర్ వస్తుందని సీబీఐ పేరుతో ఓ ఫేక్ లెటర్ హెడ్ కూడా చూపించాడు. దాంతో ఆయన తన ఖాతాలో ఉన్న రూ. 91.64 లక్షలు సైబర్ నేరగాడు సూచించిన ఖాతాలోకి పంపాడు. ఆ తర్వాత ఆ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫెడెక్స్ పేరుతోనే ఎక్కువ మోసాలు
ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసులో పేరున్న ఫెడెక్స్ పేరునే ఎక్కువ మంది సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు. విదేశాల నుంచి కొరియర్ వచ్చిందని చెప్పడానికి ఇదయితే నమ్మకం కలిగించేలా ఉంటుందన్నది వారి ప్లాన్. దీంతో తమ సంస్థకు చెడ్డపేరు వస్తుందని భావించిన ఫెడెక్స్ వినియోగదారులను, ప్రజలను అప్రమత్తం చేస్తూ పేపర్లలో ప్రకటనలు ఇచ్చింది. ఫెడెక్స్ పేరుతోవచ్చే ఇలాంటి నకిలీ కాల్స్‌ను నమ్మవద్దని, డబ్బులు చెల్లించమన్నా, ఓటీపీ చెప్పమన్నా స్పందించవద్దని కోరింది. ఇలాంటి కాల్స్ వస్తే 1930కి కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్‌కు కంప్లయింట్ చేయాలని సూచించింది.