రజినీ ఇప్పుడు రాజకీయాలకు వచ్చినా వేస్ట్.. ఆయన సోదరుడు సంచలన వ్యాఖ్యలు
రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై తాజాగా ఆయన సోదరుడు సత్యనారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రజినీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ఉపయోగం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా వేస్ట్ అని ఆయన సోదరుడు సత్యనారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ కు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఇప్పటిది కాదు. దాదాపు పాతికేళ్ల కిందటి నుంచి రజినీ రాజకీయ ప్రవేశంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజకీయాల్లోకి రావాలని ఉంది.. అని పలుమార్లు రజినీకాంత్ చెప్పినప్పటికీ రాజకీయ రంగ ప్రవేశం మాత్రం చేయలేకపోయారు.
తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజినీ అధికారికంగా ప్రకటించారు. ఆరు నెలల్లో పార్టీ కూడా స్థాపిస్తానని చెప్పారు. అప్పటివరకు రాజకీయ కార్యక్రమాల నిర్వహణ కోసం రజినీ మక్కల్ మండ్రమ్ అనే వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఎన్నికల దగ్గర పడిన తర్వాత రాజకీయాల్లోకి రావట్లేదని రజినీ ప్రకటించారు. రజినీ మక్కల్ మండ్రమ్ ను కూడా రద్దు చేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతోనే రజినీ ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా.. రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై తాజాగా ఆయన సోదరుడు సత్యనారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రజినీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ఉపయోగం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన తిరుచెందూర్ కుమారస్వామి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రజినీకాంత్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఆయన వయస్సు ఏడుపదులు దాటడమే ఇందుకు కారణమని చెప్పారు. ఈ వయసులో ఆయన రాజకీయాలకు వచ్చినా చేసేదేముందన్నారు. రజినీకాంత్ భవిష్యత్తులో ఏ పార్టీకి మద్దతు పలికే అవకాశం లేదని సత్యనారాయణ రావు తెలిపారు.