అమ్ముకో సొమ్ము చేసుకో.. మోదీ పాపాల విలువ 4 లక్షల కోట్లు

అడ్డూ ఆపూ లేకుండా అమ్మకాలు కొనసాగించింది మోదీ ప్రభుత్వం. రికార్డ్ బ్రేక్ చేసింది, ఎనిమిదేళ్లలో 4.04 లక్షల కోట్ల రూపాయలు హాం ఫట్ చేసింది.

Advertisement
Update:2022-12-21 09:19 IST

ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న పెట్టుబడులు తెగనమ్మి ఆదాయం సమకూర్చుకుంటామంటే ఇక ప్రభుత్వాలు ఉండి ఉద్ధరించేదేముంది. కానీ ఆదాయం కావాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనంటోంది ఎన్డీఏ సర్కారు. గతంలో ఇదే విషయంలో కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసిన మోదీ, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు ఉపసంహరించిన పెట్టుబడుల విలువ అక్షరాలా 4.04 లక్షల కోట్లు. గతంలో యూపీఏ సర్కారు అమ్మిన ఆస్తులకంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.

ఎనిమిదేళ్లలో 4లక్షల కోట్లు హాం ఫట్..

యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,14,045 కోట్లు సేకరించింది. అప్పట్లో దీనిపై మోదీ అండ్ కో పెద్ద రాద్ధాంతం చేసింది. కానీ తాము అధికారంలోకి వచ్చాక అంతకు మించి అన్నట్టుగా ప్రవర్తించింది. అడ్డూ ఆపూ లేకుండా అమ్మకాలు కొనసాగించింది. రికార్డ్ బ్రేక్ చేసింది, ఎనిమిదేళ్లలో 4.04 లక్షల కోట్ల రూపాయలు హాం ఫట్ చేసింది.

వివరాలివి..

59 కంపెనీల్లో వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో విక్రయించడం ద్వారా రూ.1.07 లక్షల కోట్లను సేకరించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఎక్స్ చేంజ్ ట్రేడెడ్‌ ఫండ్లు (ETF) ద్వారా 10 విడతల్లో వాటాలు అమ్మేసి రూ.98,949 కోట్లు సేకరించారు. ఎయిరిండియా సహా 10 సంస్థల్లో వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా రూ.69,412 కోట్లు సేకరించారు. మోదీ తన ఎనిమిదేళ్ల పాలనలో 45 కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ వాటా అమ్మి మరో రూ.45,104 కోట్లు తెచ్చుకున్నారు.

పారదీప్‌ ఫాస్ఫేట్‌, ఐపీసీఎల్‌, టాటా కమ్యూనికేషన్‌ లో ప్రభుత్వానికున్న స్వల్ప వాటాలను మొత్తం 9538 కోట్ల రూపాయలకు అమ్మేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు 17 కేంద్ర ప్రభుత్వ సంస్థల వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించగా.. రూ.50,386 కోట్లు లభించాయి. అమ్మడంలో తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు మోదీ. అధికారంలోకి రావడానికి అడ్డదిడ్డమైన హామీలిచ్చేసి, ఆ తర్వాత ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరిచేశారు మోదీ. ప్రభుత్వ ఆస్తుల్ని కరిగించేశారు.

Tags:    
Advertisement

Similar News