తండ్రి హత్యకు సూపరీ ఇచ్చిన కూతురు.. కానీ చివరికి

ప్రియుడితో పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది సాక్షి. అయితే తన తండ్రి తనను వెతుక్కొని వస్తాడని, ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని భావించి మొత్తానికే తండ్రి అడ్డుతొలగించుకోవాల‌ని ప్లాన్ వేసింది.

Advertisement
Update:2023-08-11 17:23 IST

ప్రేమ ప్రేమను ఇస్తుందే కానీ ప్రాణాలు తియ్యదు.. కానీ ప్రేమలో ఉన్నాము అన్న భ్రమ వాళ్ళని ఎంత నీచానికైనా దిగజారేలా చేస్తుంది.. ప్రేమ కోసం కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన వారిని చూస్తున్నాం, త‌ల్లిదండ్రులు ఒప్పుకునే వ‌ర‌కు వెయిట్ చేసేవారిని చూస్తున్నాం. కానీ, ప్రేమకు అడ్డంగా ఉన్న రక్తసంబంధీకులను చంపాలనుకొనే వాళ్ళు కూడా ఉన్నారు. తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ కూతురు దారుణానికి పాల్పడింది. తన ప్రియుడితో కలిసి తండ్రి మర్డర్ చేయించేందుకు ప్లాన్ వేసింది. అందుకోసం కొందరిని మాట్లాడుకుని సుపారీ కూడా ఇచ్చింది. కానీ చివరికి అడ్డంగా దొరికిపోయింది. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది.

పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. షోలాపూర్ జిల్లా మాదా తాలూకాకు చెందిన మహేంద్ర షా వ్యాపారి. అతని కుమార్తె సాక్షి. ఎంబీఏ చదువుతున్న ఈమె స్థానికంగా బేక‌రీ నడిపే చైతన్య అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరు వివాహం చేసుకోవడానికి ఆమె తండి మహేంద్ర షా అంగీకరించలేదు. ప్రియుడితో పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది సాక్షి. అయితే తన తండ్రి తనను వెతుక్కొని వస్తాడని, ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని భావించి మొత్తానికే తండ్రి అడ్డుతొలగించుకోవాల‌ని ప్లాన్ వేసింది. అందులో భాగంగా పూణె వెళ్లిన సాక్షి ఆదివారం రాత్రి మాదాకు తిరిగి వచ్చింది. రిసీవ్ చేసుకోవడానికి రమ్మని తండ్రిని పిలిచింది. ఇద్దరూ కలిసి తిరిగి వెళ్తుండ‌గా వాష్ రూమ్ అని చెప్పి వడచివాడి గ్రామ సమీపంలో తండ్రిని కారు ఆపమంది.

కారు ఆపగానే.. హఠాత్తుగా రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, రెండు కాళ్ళు విరిచేశారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. తరువాత ఏమీ తెలియనట్టుగా సాక్షి స్థానికులతో కలిసి తీవ్ర గాయాలపాలైన మహేంద్రను ఆస్పత్రికి తరలించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దాడిపై సాక్షిని ప్రశ్నించగా దోపిడీదారులే ఈ పని చేసినట్టు తెలిపింది. అయితే ఆమె తమను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్టుగా అనుమానించిన పోలీసులు తమ స్టైల్ లో విచారించారు. ఆమె ఫోన్ కాల్ డేటాతో సహా ఇతర వివరాలు కూపీ లాగేసరికి సాక్షి ప్లాన్ బయట పడింది. ఈ కుట్రలో ఆమె ప్రియుడి హస్తం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News