'దానా' తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
దీని ప్రభావంతో శనివారం వరకు ఒడిషా, పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్గాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన 'దానా' తుపాను నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దు చేసిన, దారి మళ్లించిన వాటిలో దాదాపు 200 సర్వీసులు ఉన్నాయి. 23,24, 25 తేదీల్లో వీటిని రద్దు చేశారు. ఈ వివరాలను ప్రయాణికులకు తెలియజేయడానికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో 08912746330, 08912744619, 8712641255, 7780787054 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
గంటకు 18 కి.మీ వేగంతో కదులుతున్న తుపాను
దానా తుపాను గంటకు 18 కి.మీ వేగంతో కదులుతున్నది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా బలపడనున్నది. బుధవారం ఉదయానికి ఒడిషాలోని పరదీప్‌కు 560 కి.మీ, పశ్చిబెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి 630 కి.మీ, బంగ్లాదేశ్‌లోని ఖేపురకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. దీని ప్రభావంతో శనివారం వరకు ఒడిషా, పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్గాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలోనూ పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడవచ్చని వెల్లడించింది.