కేరళలో 18 రోజులు, యూపీలో 2 రోజులు.. రాహుల్ యాత్రపై సీపీఎం సెటైర్లు..

ప్రస్తుతం కేరళలో రాహుల్ యాత్ర జరుగుతోంది. కేరళ షెడ్యూల్ మొత్తం 18 రోజులు, కానీ బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ లో మాత్రం యాత్ర నిడివి కేవలం 2 రోజులు. ఈ షెడ్యూల్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సీపీఎం నేతలు.

Advertisement
Update:2022-09-13 08:03 IST

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ఇప్పటి వరకూ బీజేపీ నేతలు మాత్రమే విమర్శలు చేశారు. ఇప్పుడు కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం కూడా యాత్రపై అసహనం వ్యక్తం చేసింది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ తో పోరాటం చేస్తానంటున్న రాహుల్ గాంధీ, యాత్ర విషయంలో మాత్రం విచిత్రంగా వ్యవహరిస్తున్నారంటూ సెటైర్లు వేశారు కేరళ సీపీఎం నేతలు. ప్రస్తుతం కేరళలో రాహుల్ యాత్ర జరుగుతోంది. కేరళ షెడ్యూల్ మొత్తం 18 రోజులు, కానీ బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ లో మాత్రం యాత్ర నిడివి కేవలం 2 రోజులు. ఈ షెడ్యూల్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సీపీఎం నేతలు. బీజేపీతో పోరాటం చేయాలంటే, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కువ రోజులు పర్యటించాలని, కానీ రాహుల్ గాంధీ తాను ఎంపీగా పోటీ చేసిన కేరళలో తన సీటు కోసం ఇక్కడిక్కడే చక్కర్లు కొడుతున్నారని సెటైర్లు వేశారు సీపీఎం నేతలు. ఈమేరకు ఓ కార్టూన్ రూపొందించి సీపీఎం అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది భారత్ జోడో యాత్ర కాదు, సీటు జోడో యాత్ర అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

బీజేపీ-ఏ టీమ్..

సీపీఎం విమర్శలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేరళలో బీజేపీకి ఏ టీమ్ గా వ్యవహరిస్తున్న సీపీఎం తమపై చౌకబారు విమర్శలు చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్. కేరళలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్, సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ కి మధ్య మాత్రమే ఫైట్ జరుగుతుందన్నారు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రాంతాలు కవరయ్యేలా యాత్ర షెడ్యూల్ రూపొందించారు. ఈ షెడ్యూల్ ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ సీపీఎంపై మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. తమ టార్గెట్ బీజేపీ అని, ఎన్డీఏని గద్దె దించేందుకే భారత్ జోడో యాత్ర అని చెబుతున్నారు. విపక్షాల ఐక్యతకు ముప్పు రాకూడదని, అదే సమయంలో విపక్షాల బలంలో కాంగ్రెస్ పాత్ర కూడా తగ్గదని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

Tags:    
Advertisement

Similar News