రాజ్యాంగ దినోత్సవం.. మోడీ, షాల విషెస్‌

పటిష్ఠ భారత్‌ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపు

Advertisement
Update:2024-11-26 11:37 IST

రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు (మంగళవారం) పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగసభ పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగాన్ని ఆమోదించగా..1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ రోజును సంవిధాన్‌ దివస్‌గా పాటిస్తున్నారు. రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.పటిష్ఠ భారత్‌ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని వారు పిలుపునిచ్చారు. భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని అమిత్‌షా పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత, సమగ్రతకు పెద్ద పీట వేస్తున్నదన్నారు. దేశాభివృద్ధిలో రాజ్యాంగ నిర్మాతల సహకారాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలను జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగం అంటే కేవలం వేదికలపై ప్రదర్శించే పుస్తకం కాదని.. అందులోని విషయాలను పూర్తి భక్తితో పాటించడం అత్యంత కీలకమని షా పేర్కొన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రపంచమంతా హర్షిస్తున్నదని కేంద్ర హో మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు సంబంధించి భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచిందన్నారు. 2008 ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆయన నివాళి అర్పించారు. మానవత్వం తలదించుకునేలా ఉగ్రమూకలు ఇవాళ్టి రోజు ముంబయిలో ఎందరో ప్రాణాలను బలిగొన్నారని షా మండిపడ్డారు. ఈ మేరకు ముంబయి టెర్రర్‌ అటాక్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. 

రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 75 ఏళ్లు పూర్తికావడంతో ఇవాళ పాత పార్లమెంటు భవనం ప్రాంగణంలోని సెంట్రల్‌ హాల్‌లో వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వంలో జరగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా పాల్గొన్నారు. రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించరని స్పష్టం చేశారు. 


Tags:    
Advertisement

Similar News