మణిపూర్‌లో హింసాకాండపై సీఎం ప్రకటన
మణిపూర్‌లో హింస ఉదంతంపై తదుపరి విచారణ మే 17వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మణిపూర్‌లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు భద్రతా బలగాలను భారీ స్థాయిలో మోహరించారు.
మణిపూర్‌లో అక్కడి బీజేపీ ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయంతో చెలరేగిన అల్లర్ల చిచ్చు ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ మంగళవారం అక్కడి పరిస్థితులను ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన అల్లర్లలో 60 మంది మృతిచెందారని ఆయన తెలిపారు. 231 మంది గాయపడ్డారని చెప్పారు. సోమవారం వరకు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. ఇంకా 10 వేల మందిని తరలించాల్సి ఉందని తెలిపారు.
అక్కడి అల్లర్లలో 1700 ఇళ్లు దగ్ధమయ్యాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోపక్క మణిపూర్‌లో ప్రాణ, ఆస్తి నష్టంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. స్థానికంగా ఉన్న ప్రార్థనా స్థలాలను పరిరక్షించడంతో పాటు బాధితులకు సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి సూచించింది.
మణిపూర్‌లో హింస ఉదంతంపై తదుపరి విచారణ మే 17వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మణిపూర్‌లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు భద్రతా బలగాలను భారీ స్థాయిలో మోహరించారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లను అక్కడి ప్రభుత్వం వినియోగిస్తోంది.