నేడే చంద్రయాన్-3 ల్యాండింగ్..
జులై 14న నింగిలోకి చంద్రయాన్-3 దూసుకెళ్లగా దాదాపు 41 రోజుల ప్రయాణం సాఫీగా సాగింది. ప్రతి దశలోనూ ఊహించిన విధంగానే ఫలితాలు ఎదురయ్యాయి. ఇప్పుడు చివరి ఘట్టం కూడా అత్యంత సాఫీగా జరుగుతుందనే అంచనాలున్నాయి.
చంద్రయాన్-3 ల్యాండింగ్ షెడ్యూలు ప్రకారమే జరుగుతుందని మంగళవారం రాత్రి ఇస్రో మరోసారి స్పష్టం చేసింది. దీంతో చంద్రయాన్-3 ల్యాండింగ్ పై ఉన్న కొన్ని అనుమానాలు కూడా తొలగిపోయాయి. అన్ని వ్యవస్థలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని.. అంతా సాఫీగా సాగుతోందని ఇస్రో పేర్కొంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ ఈరోజు సాయంత్రం సరిగ్గా 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెడుతుంది.
సర్వత్రా ఉత్కంఠ..
ఇటీవలే రష్యా మిషన్ లూనా-25 ఫెయిలైంది, భారత్ కి కూడా ఓ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. అయితే ఈసారి మాత్రం విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి జులై 14న నింగిలోకి చంద్రయాన్-3 దూసుకెళ్లగా దాదాపు 41 రోజుల ప్రయాణం సాఫీగా సాగింది. ప్రతి దశలోనూ ఊహించిన విధంగానే ఫలితాలు ఎదురయ్యాయి. ఇప్పుడు చివరి ఘట్టం కూడా అత్యంత సాఫీగా జరుగుతుందనే అంచనాలున్నాయి. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా చంద్రయాన్-3 ఆఖరి ఘట్టాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ మిషన్ సక్సెస్ అయితే.. అంతరిక్ష చరిత్రలో భారత్ సరికొత్త చరిత్రను లిఖిస్తుంది. ఇప్పటి వరకు చంద్రుడి దక్షిణ ధ్రువం వద్దకు ఏ దేశం కూడా వ్యోమనౌకను సురక్షితంగా దింపలేదు, ఆ ఘనత సాధించిన తొలి దేశం భారత్ అవుతుంది.
17నిమిషాలు కీలకం..
చంద్రయాన్-3 ల్యాండింగ్ టైమ్ సాయంత్రం 6.04 గంటలు. అంతకు ముందు 17 నిమిషాలు ఈ ప్రయోగంలో అత్యంత కీలకం. ఆ 17 నిమిషాలు అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ప్రయోగం సక్సెస్ అవుతుంది. విశేషం ఏంటంటే.. అప్పటి వరకు మిషన్ పూర్తిగా శాస్త్రవేత్తల కంట్రోల్ లో ఉంటుంది. ఆ 17 నిమిషాలు మాత్రం ల్యాండర్ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంది. దానిపై శాస్త్రవేత్తల నియంత్రణ ఉండదు. సేఫ్ ల్యాండింగ్ తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటికొస్తే మళ్లీ శాస్త్రవేత్తల నియంత్రణ మొదలవుతుంది.
పూజలు, యాగాలు..
చంద్రయాన్-3 సక్సెస్ కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పూజలు, యాగాలు మొదలయ్యాయి. ల్యాండింగ్ జరిగే వరకు నిరాటంకంగా కొన్నిచోట్ల యాగాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో చంద్రయాన్ -3 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా అనుమతులిచ్చాయి. మొత్తమ్మీద చంద్రయాన్-3 ఉత్కంఠకు ఈరోజుతో తెరపడుతుంది.