మణిపూర్ నుంచి ఆర్ఏఎఫ్‌ను వెనక్కు పిలవాలని కేంద్ర నిర్ణయం?

ఆర్ఏఎఫ్ దళాలు జనాలను అదుపు చేయడానికి, లా అండ్ ఆర్డర్ డ్యూటీలకు, నిరసనలు, మత ఘర్షణలు అదుపు చేయడానికి మాత్రమే ట్రైనింగ్ తీసుకుంటారు.

Advertisement
Update:2023-09-18 10:01 IST

కల్లోలిత మణిపూర్ రాష్ట్రం నుంచి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) దళాలను కేంద్ర వెనక్కు పిలిపించాలని భావిస్తోంది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కుకి-మైతేయి తెగల మధ్య కొన్ని నెలలుగా ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ఆయా ఘర్షణలను నివారించాలనే ఉద్దేశంతో మణిపూర్‌కు ఆర్ఏఎఫ్ బలగాలను పంపించారు. కాగా, ప్రస్తుతం మణిపూర్‌లో ఉన్న పరిస్థితులకు ఆర్ఏఎఫ్ సరిపోదని భావించిన కేంద్రం.. వారిని వెనక్కు పిలిపించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.

ఆర్ఏఎఫ్ దళాలు జనాలను అదుపు చేయడానికి, లా అండ్ ఆర్డర్ డ్యూటీలకు, నిరసనలు, మత ఘర్షణలు అదుపు చేయడానికి మాత్రమే ట్రైనింగ్ తీసుకుంటారు. కానీ ప్రస్తుతం మణిపూర్‌లో తిరుగుబాటు జరుగుతోంది. ఇటీవల ఒక ఆర్ఏఎఫ్ యూనిట్‌పై గ్లాస్ బాల్స్, రాళ్లు, పదునైన రాడ్లు, పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. దాదాపు 3వేల మంది ఆందోళనకారులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. జూలై 4న ఈ భారీ దాడి జరిగింది. పోలీస్ ఆర్మరీ నుంచి ఆయుధాలు ఎత్తుకొని వెళ్తుండగా ఆర్ఏఎఫ్ అడ్డుకున్నది. అయితే ఆయుధాలతో ఉన్న ఆందోళనకారులను అదుపు చేయలేకపోయిందని ఒక అంతర్గత నివేదికలో పేర్కొన్నట్లు తెలుసుస్తున్నది.

ప్రస్తుతం మణిపూర్‌లోని ఎనిమిది లోయ ప్రాంతపు జిల్లాల్లాలతో పాటు పట్టణాల్లో 10 కంపెనీల ఆర్ఏఎఫ్ దళాలు ఉన్నాయి. అయితే వీరి వెంట సీనియర్ అధికారులు కానీ, మెజిస్ట్రేట్లు కానీ లేరు. ఆర్ఏఎఫ్ దళాలకు సీనియర్ అధికారులు, మెజిస్ట్రేట్లు ఆర్డర్లు ఇస్తే కానీ ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోరు. వీరి వద్ద ఆయుధాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని, ఆ ఆయుధాలను కూడా ఉపయోగించే వీలుండదని ఆర్ఏఎఫ్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఆర్ఏఎఫ్ అనేవి ఒక క్విక్ రెస్పాన్ టీమ్ మాత్రమే. కర్రలతో జనాలను అదుపు చేయడమే వీరికి తెలిసింది. ఎలాంటి నష్టం జరగకుండా వీళ్లు వ్యవహరిస్తారు. అలాంటి దళాలను మణిపూర్ అల్లర్ల కోసం ఉపయోగించడం సరైనది కాదని కేంద్ర హోం శాఖకు లేఖ రాసినట్లు తెలుస్తున్నది.

ఆర్ఏఎఫ్‌ను 1992లో మత ఘర్షణ సమయంలో ఏర్పాటు చేశారు. గుంపులను చెదరగొట్టడం, శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని రావడం వీరి బాధ్యత. ఎలాంటి భారీ ఆయుధాలు లేకుండా.. లాఠీలతో పని చేయడం సాధారణంగా ఈ దళాలకు అలవాటు. ఈ మొత్తం ఆర్ఏఎఫ్‌లో కేవలం మూడింట ఒక వంతు వద్ద మాత్రమే ఆయుధాలు కలిగి ఉంటారు. అయితే మణిపూర్ లాంటి చోట్ల వీరిని నియమించడం అంటే.. వారి పనికి మించిన భారమని సీనియర్ అధికారులు పేర్కొన్నారు.

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (ఏఎఫ్ఎస్‌పీఏ) అమలులో ఉన్న మణిపూర్‌కు వీరిని పంపడమే పెద్ద తప్పిదంగా సీనియర్ ఆర్ఏఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఆందోళనకు దిగుతున్న వారిలో ఎక్కువగా మహిళలు, పౌరులే ఉన్నారు. పైగా వారి వద్ద ఆయుధాలు కూడా ఉంటున్నాయి. ఈ సమయంలో ఆయుధాలే సరిగా లేని ఆర్ఏఎఫ్ మాత్రం ఎలా కంట్రోల్ చేయగలదని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆర్ఏఎఫ్‌ను వెనక్కు పిలిపించి.. వారి స్థానంలో ఆయుధాలు ఉండే సీఆర్పీఎఫ్‌ను రంగంలోకి దింపడం మంచిదని కేంద్రానికి నివేదికలో సూచించారు.

Tags:    
Advertisement

Similar News