వాప్‌కాస్ మాజీ చైర్మన్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
ఈ సోదాల్లో అత్యధికంగా చండీఘర్‌లోని రాజేందర్‌కుమార్ గుప్తా కుమారుడి నివాసం నుంచి రూ.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ రంగ సంస్థ వాప్‌కాస్ లిమిటెడ్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజేందర్ కుమార్ గుప్తాకు చెందిన 19 ప్రదేశాల్లో సీబీఐ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా గుట్టలుగా నోట్ల కట్టలను గుర్తించినట్టు తెలిపింది. రూ.20 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు మంగళవారం వెల్లడించింది.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారని గుర్తించిన సీబీఐ ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై ఇటీవల కేసు నమోదు చేసింది. ఢిల్లీ, గుర్‌గావ్, పంచకుల, చండీఘర్, సోనీపట్‌లలోని గుప్తా ఇళ్లతో పాటు పలు ప్రదేశాల్లో సీబీఐ ఈ సోదాలు చేపట్టింది.
ఈ సోదాల్లో అత్యధికంగా చండీఘర్‌లోని రాజేందర్‌కుమార్ గుప్తా కుమారుడి నివాసం నుంచి రూ.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. నగదుతో పాటు ఆస్తుల పత్రాలు, ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నవాటిలో ఉన్నాయి. వాప్‌కాస్‌ను గతంలో వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ అని పిలిచేవారు. ఇది జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. 2011 నుంచి 2019 మధ్యకాలంలో రాజేందర్‌కుమార్ గుప్తా భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. పదవీ విరమణ అనంతరం ఆయన ఢిల్లీలో ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించి నిర్వహించినట్టు సమాచారం.