పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
విపక్ష ఎంపీల నిరసనల మధ్య ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆదానీ వ్యవహారంలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. విపక్షాల నిరసనలపై లోక్‌సభ స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై ప్రతిపక్ష ఎంపీల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడ్డాయి. మరోవైపు సమావేశాల ప్రాంభానికి ముందు కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్లమెంట్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో భేటీ అయ్యారు.
సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అయితే ఓ వినూత్న బ్యాగ్ తో పార్లమెంట్ వద్ద నిరసన తెలుపుతూ దర్శనమిచ్చారు ప్రియాంక గాంధీ. గౌతమ్ ఆదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనపై జేపీసీ విచారణ చేపట్టాలంటూ పార్లమెంట్ బయట కాంగ్రెస్, విపక్ష ఎంపీలు నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, అదానీ చిత్రాలతో పాటు.. ” మోదీ – అదానీ భాయ్ భాయ్” నినాదం ముద్రించిన బ్యాగ్ తో పార్లమెంట్ కి ప్రియాంక గాంధీ వచ్చారు. ప్రియాంక చేతిలోని బ్యాగ్ ని పరిశీలించిన రాహుల్ గాంధీ.. ఎంతో క్యూట్ గా ఉందని అన్నారు. ఇక ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. సభా కార్యక్రమాల్లో మేము పాల్గొనాలనుకుంటున్నామని.. కానీ ప్రభుత్వం చర్చను కోరుకోవడం లేదని అన్నారు. ఏదో ఒక కారణంతో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తున్నారనిప్రియాంక గాంధీ అన్నారు