'43 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ కుట్ర చేస్తోంది'

డబ్బును ఎరగా చూపి 43 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు.

Advertisement
Update:2022-10-29 19:07 IST

డబ్బును ఎరగా చూపి 43 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. తెలంగాణలోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో కూడా బీజేపీ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నదని ఆయన అన్నారు. 43 మంది ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీలోని కీలక వ్యక్తులు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న వ్యవహారం వెనుక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నట్లు అనుమానం ఉందని.. విచారణలో కనుక ఆయన దోషి అని తేలితే వెంటనే అరెస్టు చేయాని ఆయన డిమాండ్ చేశారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొనుగోళ్లకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్‌ను వినిపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెంటనే దీనిపై విచారణ చేయాలని ఆయన కోరారు.

కేంద్ర హోం శాఖ మంత్రి ఇలాంటి కుట్రలో భాగస్వామ్యుడిగా ఉండటం దేశానికే ప్రమాదకరమని సిసోడియా అన్నారు. ఇటీవల తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అక్కడ బీజేపీ బేరసారాల విషయంలో అడ్డంగా దొరికిపోయిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఇలా డబ్బు ఎర చూపి కొనుగోలు చేయడం దారుణమని అన్నారు. ఇప్పటికే ఎన్నో రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనేసి బీజేపీ ప్రభుత్వాలను పడగొట్టిందని సిసోడియా అన్నారు.

Tags:    
Advertisement

Similar News