గుజరాత్‌లో బీజేపీ ఎన్నికల స్టంట్.. గ్యాస్ సిలిండర్లు ఉచితం..

గుజరాత్ ప్రభుత్వం 2 సిలిండర్లను పూర్తి రాయితీతో పంపిణీ చేస్తామంటోంది. అంటే ప్రజలు గ్యాస్ సిలిండర్లకు సొమ్ము చెల్లించి కొనుగోలు చేస్తే, ఆ తర్వాత రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం వారి అకౌంట్లలో జమ చేస్తుంది.

Advertisement
Update:2022-10-18 07:37 IST

దేశవ్యాప్తంగా పాల ధర లీటర్‌కి 2 రూపాయలు పెంచారు. కానీ గుజరాత్ మాత్రం దానికి మినహాయింపు. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల ధరతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ గుజరాత్ వాసులకి మాత్రం ఏడాదికి రెండు సిలిండర్లు ఉచితం. ఇంతకీ గుజరాత్ ఎందులో గొప్ప..? ఎవరికి గొప్ప..? ఎందుకీ వల్లమాలిన ప్రేమ..? కారణం కేవలం ఎన్నికలు.

గుజరాత్‌లో ఎన్నికల సీజన్ దగ్గరపడింది. మోదీ సొంత రాష్ట్రం కావడంతో ఈసారి అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టారు. శంకుస్థాపనలు, రిబ్బన్ కటింగ్‌లు అంటూ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్ని గుజరాత్‌కి మోసుకొస్తున్నారు మోదీ. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పక్కలో బల్లెంలా మారింది. పంజాబ్‌ని బీజేపీకి దక్కకుండా చేసిన ఆప్, ఇప్పుడు గుజరాత్‌పై కూడా కన్నేసింది. ఉచిత విద్యుత్ హామీతో ప్రజల్ని ఆకట్టుకుంటోంది. దీంతో బీజేపీ రగిలిపోతోంది, పొరపాటున గుజరాత్‌లో ఓడిపోతే, ఆ ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపై పడుతుంది. కేంద్రంలో బీజేపీ కూలిపోవడం ఖాయం. ఈ విషయం తెలిసే ఇప్పుడు గుజరాత్‌లో నష్టనివారణ చర్యలు ప్రారంభించారు బీజేపీ నేతలు. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఎన్నికల సంట్లు ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ కూడా అందులో ఒకటి.

ఏడాదికి రెండు సిలిండర్లు ఫ్రీ..

గుజరాత్‌లో ఏడాదికి 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటించారు మంత్రి జితు వాఘాని. ఈ నిర్ణయంతో 38 లక్షల మంది గృహిణులకు వెయ్యి కోట్ల రూపాయల మేర ఉపశమనం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా దీన్ని అందిస్తోందని అన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఈ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

అక్కడే మెలిక..

గ్యాస్ రాయితీ పేరుతో దేశ ప్రజల్ని దారుణంగా మోసం చేసింది కేంద్రం. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం కూడా 2 సిలిండర్లను పూర్తి రాయితీతో పంపిణీ చేస్తామంటోంది. అంటే ప్రజలు గ్యాస్ సిలిండర్లకు సొమ్ము చెల్లించి కొనుగోలు చేస్తే, ఆ తర్వాత రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం వారి అకౌంట్లలో జమ చేస్తుంది. ఈ రాయితీకి ఎప్పుడైనా ప్రభుత్వం మంగళం పాడేయొచ్చనమాట. గతంలో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్‌కి 50 రూపాయల మేర రాయితీ సొమ్ము బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యేది. ఇప్పుడది 10 నుంచి 15 రూపాయలకు చేరింది. అది కూడా సమయానికి అకౌంట్లలో పడటంలేదు. దీని గురించి ప్రజలు ఆలోచించడమే మానేశారు. ఇప్పుడు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయితీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఎన్నికలయ్యాక ఈ పథకం అటకెక్కుతుందనే అనుమానాలు మాత్రం ప్రజల్లో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News