కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఒక్క ముస్లిం ఓటు కూడా బీజేపీకి అక్కర్లేదు.. కర్ణాటక మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
రాష్ట్రంలో ముస్లింల విద్య, వైద్యం కోసం, ఇతర సంక్షేమ పథకాల కోసం బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చు పెట్టిందని, అయినప్పటికీ వారు బీజేపీకి ఓటు వేయరని చెప్పారు.
కర్ణాటకలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం హాట్‌హాట్‌గా మారుతోంది. ఎన్నికలు వస్తే చాలు బీజేపీ నాయకులు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా మతాన్ని ఉపయోగించుకుంటూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ మంత్రి ఈశ్వరప్ప తాజాగా జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీకి ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
గతంలో శివమొగ్గ ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఈశ్వరప్పకు ఈసారి బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. వయసును సాకుగా చూపి చన్నబసప్ప అనే వ్యక్తికి టికెట్ ఇచ్చింది. దీంతో ఈశ్వరప్ప చన్నబసప్ప తరఫున శివమొగ్గలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వక్కలిగ, లింగాయత్ సామాజికవర్గ ప్రతినిధులతో శివమొగ్గలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరప్ప పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదని తేల్చి చెప్పారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వారెవరూ తమ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం ఎంత కృషిచేసినా.. వారు మాత్రం తమకు ఓటు వేయరన్నారు.
రాష్ట్రంలో ముస్లింల విద్య, వైద్యం కోసం, ఇతర సంక్షేమ పథకాల కోసం బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చు పెట్టిందని, అయినప్పటికీ వారు బీజేపీకి ఓటు వేయరని చెప్పారు. అందుకే ఒక్క ముస్లిం ఓటు కూడా తమకు అక్కర్లేదని నిర్భయంగా చెబుతున్నామన్నారు. శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 60 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని, వారెవరూ తమకు ఓటేయాల్సిన అవసరం లేదని ఈశ్వరప్ప అన్నారు.
కాగా ఈశ్వరప్ప ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు ఉపయోగించడంపై గతంలో ఈశ్వరప్ప విమర్శలు చేశారు. లౌడ్ స్పీకర్లు ఉపయోగించి ప్రార్థనలు చేస్తే గానీ అల్లాకు వినిపించదా? అల్లాకు ఏమైనా చెవుడు ఉందా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా హిందువుల ఓట్ల కోసం ఈశ్వరప్ప ముస్లింలపై విమర్శలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.