ఆప్ ఢిల్లీని డంపింగ్ యార్డులా మార్చేసింది
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఆమ్ ఆద్మీ పార్ట ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీని డంపింగ్ యార్డులా మార్చేసిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున గురువారం ఆయన ప్రచారం చేశారు. విదేశాల నుంచి అక్రమ వలసలను అడ్డుకోవడంలోనూ ఆప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు దేశంలో అక్రమంగా చొరబడితే ఆప్ ప్రభుత్వం వారికి సకల సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. తద్వారా ఢిల్లీని ఆప్ డంపింగ్ యార్డుగా మార్చేసిందన్నారు. యమునా నదిని మురికి కూపంగా మార్చేశారని మండిపడ్డారు. ప్రయాగ్ రాజ్ లో నిర్వహిస్తోన్న మహాకుంభమేళాలో తాను తన కేబినెట్ మంత్రులతో కలిసి పుణ్యస్నానం చేశానని.. కేజ్రీవాల్ ఢిల్లీలోని యమునా నదిలో మునగ గలరా అని ప్రశ్నించారు. ఢిల్లీలో మురుగునీళ్లు పొంగిపొర్లుతున్నాయని.. తాగునీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రజలకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయలేకపోతున్నారని చెప్పారు. అబద్ధాలు చెప్పడమే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమ పనిగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.