జేపీసీ కార్యకలాపాలు సజావుగా సాగేలా ఆదేశించండి
లోక్‌సభ స్పీకర్ కు విపక్ష ఎంపీల ఫిర్యాదు
వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కర్యకలాపాలు సజావుగా సాగేలా చైర్మన్‌ను ఆదేశించాలని కోరుతూ పది మంది విపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు శుక్రవారం సాయంత్రం లేఖ రాశారు. పార్లమెంట్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన జేపీసీ సమావేశం నుంచి పది మంది విపక్ష ఎంపీలను చైర్మన్ జగదాంబికా పాల్ సస్పెండ్ చేశారు. జేపీసీ మీటింగ్‌లో వాగ్వాదం జరిగిందని చెప్తూ తమను సస్పెండ్ చేయడాన్ని ఎ. రాజా సహా విపక్ష ఎంపీలు ఖండించారు. సమావేశంలో ఫోన్‌లో మాట్లాడుతున్న చైర్మన్ ఉన్నట్టుండి తమను సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ విస్తృతంగా చర్చించాలని సూచించారని.. అందుకు అనుణంగా సమావేశాలు జరగడం లేదని ఆక్షేపించారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ కు లేఖ రాసిన వారిలో జేపీసీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎంపీలు ఎ. రాజా, కళ్యాణ్ బెనర్జీ, ఎండీ జావిద్, అసదుద్దీన్ ఓవైసీ, నాసిర్ హుస్సేన్, మొహిబుల్లా, ఎం. అబ్దుల్లా, అర్వింద్ సావంత్, నదీమ్ ఉల్ హక్, ఇమ్రాన్ మసూద్ ఉన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జేపీసీ ఈనెల 27న తిరిగి సమావేశం కానుంది.