మహా కుంభమేళాలో 10 కోట్ల మంది పుణ్యస్నానాలు
ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
మహా కుంభమేళాలో (గురువారం మధ్యాహ్నం వరకు 10 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 13న ప్రారంభమైన మహాకుంభమేళా మహాశివరాత్రి పర్వదినం వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. భారత్ తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొంటున్నారని యూపీ సర్కారు వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం వరకు (ఒక్కరోజే) 30 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పూణ్యస్నానాలు చేశారని తెలిపింది. మకర సంక్రాంతి ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ కు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారని, 1.7 కోట్ల మంది పౌష్ పౌర్ణమి రోజున తరలివచ్చారని వెల్లడించింది. పండుగ రోజుల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆయా ప్రత్యేక రోజుల్లో పుణ్యస్నానాలపై యూపీ ప్రభుత్వం పరిమితులు విధించింది. మిగతా రోజుల్లో ఎలాంటి ఆంక్షలు లేవని.. భక్తులు ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపింది.