వైజాగ్ స్టీల్ ను కాపాడేందుకే ప్రత్యేక ప్యాకేజీ
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. గురువారం భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.11,440 కోట్ల ప్యాకేజీలో క్యాపిటల్ షేర్ గా రూ.10,300 కోట్లు మిగతా రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ గా కేటాయించామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి పెంచాలనేదే ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యమని చెప్పారు. ఉద్యోగులు, కార్మికులకు రెండు నెలలకు సంబంధించిన రూ.230 కోట్ల జీతాలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని భారీ ప్యాకేజీ ప్రకటించామని, అయినా కొందరు దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరో భారీ ప్యాకేజీని కూడా స్టీల్ ప్లాంట్ కు ప్రకటించే అవకాశముందన్నారు. వైజాగ్ స్టీల్ ను సెయిల్ లో విలీనం చేయమని.. అలాగని ప్రైవేటీకరించే ఆలోచన కూడా తమకు లేదన్నారు. జిందాల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు లేకున్నా అవి లాభాల్లో ఉన్నాయని.. సొంత గనులు ఉంటేనే లాభాలు వస్తాయి లేకపోతే నష్టపోతాయనే ప్రచారం నిజం కాదన్నారు.