కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర..సీఎం సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికలకు ముందే అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సంచలన ఆరోపణ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సంచలన ఆరోపణ చేశారు. ఈ కుట్రలో ఇద్దరు భాగస్వాములు ఉన్నారని, ఒకరు బీజేపీ కార్యకర్త అని, మరోకరు ఢిల్లీ పోలీసులని తెలిపారు. కేజ్రీవాల్‌పై వరుస దాడులకు సంబంధి ఈసీకి ఫిర్యాదు చేశామని ఈ దాడులపై ఆడిట్ రిపోర్ట్ కోరామని ఆమె తెలిపారు. కేజ్రీవాల్‌పై హరి నగర్‌లో జరిగిన దాడి గురించి సీఎం మాట్లాడుతూ, దుండగులు కేజ్రీవాల్ కారు వద్దకు చేరుకున్నప్పుడు ఢిల్లీ పోలీసులను వారిని అడ్డుకోలేదని చెప్పారు.
దుండగులు కలిబరి వద్ద రాళ్లు, కర్రలతో వచ్చినప్పటికీ పోలీసులు చూస్తూ నిలబడిపోయారని తెలిపారు. కేజ్రీవాల్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యమని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఎలాంటి హింసాకాండ, దాడులు జరగలేదని ఒప్పుకోవాలంటూ ఆప్ కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. కేజ్రీవాల్‌కు జడ్ ప్లస్ క్యాటగిరి ఉందని బీజేపీ, పోలీసులు చేస్తు్న్న వాదనపై అతిషి నిలదీశారు. దేశ చరిత్రలో జడ్ ప్లస్ క్యాటగిరిలో ఉన్న వ్యక్తి కారుపై రాళ్లతో దాడి జరగడం, పోలీసులు ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ను అంతం చేయడమే బీజేపీ, అమిత్‌షా ఏకైక లక్ష్యంగా ఉందంటూ ఘాటు ఆరోపణలు చేశారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.