ఈ బిచ్చగాడు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు!
భరత్ జైన్‌కి భార్య, ఇద్దరు మగపిల్లలతో పాటు సోదరుడు, తండ్రి కూడా ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల భరత్ జైన్ చిన్నతనంలో చదువుకోలేకపోయాడు.
భిక్షాటన చేసేవారిలో కొంతమంది ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత కూడా ఆ వృత్తిని మానుకోరు. అలాంటి కోవకే చెందిన బిచ్చగాడు.. భరత్ జైన్. ముంబైకి చెందిన ఇతనికి కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయంటే ఆశ్చర్యపోకతప్పదు. ఓ జాతీయ మీడియా సంస్థ అతని వివరాలు వెల్లడించడం వల్లే ఈ విషయం బయటికి తెలిసింది. ఇంతకీ ఇతని మొత్తం ఆస్తి ఎంతో తెలుసా.. అక్షరాలా 7 కోట్ల 50 లక్షల రూపాయలు.
ప్రపంచంలోని బిచ్చగాళ్లలో భరత్ జైనే సంపన్నుడట. అతనికి ముంబైలో రూ.1.2 కోట్ల విలువైన స్థలం, థానేలో రెండు షాపులు ఉన్నాయట. ఈ షాపుల ద్వారా నెలకు రూ.30 వేల ఆదాయం వస్తుందట. భరత్ జైన్ భిక్షాటన చేసేది కూడా ముంబైలోని ముఖ్యప్రాంతాల్లోనేనట. రోజుకు రూ.2 వేల నుంచి రూ.2500 వరకు సంపాదిస్తాడట. ఇలా అతనికి నెలరోజులు పూర్తయ్యే సరికి కనీసం రూ. 60 వేల నుంచి రూ.75 వేలు ఆదాయం వస్తుందట. అద్దెల రూపంలో వచ్చేది దీనికి అదనం.
భరత్ జైన్‌కి భార్య, ఇద్దరు మగపిల్లలతో పాటు సోదరుడు, తండ్రి కూడా ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల భరత్ జైన్ చిన్నతనంలో చదువుకోలేకపోయాడు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో వీధుల్లో భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీసుకొచ్చాడు. క్రమంగా దాన్నే వృత్తిగా మలచుకున్నాడు. పిల్లలు తనలా మారకూడదనే ఉద్దేశంతో వారిని ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నాడు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్యారెల్‌లో ఓ సింగిల్ బెడ్‌రూమ్ డూప్లెక్స్ ఇంటిలో జీవనం సాగిస్తున్నాడు.
ఇతని కుటుంబ సభ్యులు కూడా ఖాళీగా ఉండరట. ఇంటికి దగ్గర్లో ఓ స్టేషనరీ షాప్ నిర్వహిస్తున్నారు. భిక్షాటన మానేయాల్సిందిగా వాళ్లు భరత్‌ని ఎన్నోసార్లు కోరినప్పటికీ, వారి సలహాను విస్మరిస్తున్నాడట. తన వృత్తిని కొనసాగిస్తానంటూ రోజూ బిచ్చమెత్తుకునేందుకు వెళ్తున్నాడట. అదండీ సంగతి.