ఫస్ట్ టైం ఎమ్మెల్యే..రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్‌.!

భజన్‌లాల్‌ శర్మ సంగనేర్‌ అసెంబ్లీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement
Update:2023-12-12 17:33 IST

చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ తరహాలోనే రాజస్థాన్ సీఎం విషయంలోనూ సంచలన నిర్ణయం తీసుకుంది బీజేపీ అధిష్ఠానం. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫస్ట్ టైం ఎమ్మెల్యే భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ఎంపిక చేసింది. మాజీ సీఎం వసుంధర రాజే స్వయంగా భజన్‌లాల్‌ శర్మ పేరును తదుపరి రాజస్థాన్‌ సీఎంగా ప్రకటించారు. దియా కుమారి, ప్రశాంత్ బెర్వాలను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించింది. ఇక రాజస్థాన్ స్పీకర్‌గా వాసుదేవ్‌ దేవ్‌నానికి ఛాన్స్ ఇచ్చింది.

భజన్‌లాల్‌ శర్మ సంగనేర్‌ అసెంబ్లీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ జనరల్ సెక్రటరీగా రికార్డు స్థాయిలో నాలుగు సార్లు వ్యవహరించారు. RSS అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీలోనూ భజన్‌లాల్ గతంలో పని చేశారు. భరత్‌పూర్‌ భజన్‌లాల్‌ సొంత నియోజకవర్గం ఐనప్పటికీ..అక్కడ అగ్రవర్ణాలు గెలిచే అవకాశం లేకపోవడంతో ఆయనకు సంగనేర్‌ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది బీజేపీ. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై దాదాపు 48 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు భజన్‌లాల్‌.

నవంబర్‌ 25న రాజస్థాన్‌లోని 199 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ..115 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 69 స్థానాలకు పరిమితమైంది. ఇక నిన్న మొన్నటి వరకు సీఎం పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, దియా కుమారి, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ పేర్లు వినిపించాయి. ఐతే చివరి నిమిషంలో అనూహ్యంగా సీఎం పదవి భజన్‌ లాల్‌ శర్మను వరించింది. అశోక్‌ గెహ్లాట్ సీఎంగా ఉన్న టైంలో..క్షేత్ర స్థాయిలో పార్టీని విస్తరించడంలో భజన్‌లాల్ కీలకంగా వ్యవహరించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఓబీసీ వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌, చత్తీస్‌గఢ్‌ సీఎంగా గిరిజన నేత విష్ణు దేవ్ సాయ్‌ను ఎంపిక చేసిన అధిష్ఠానం...రాజస్థాన్‌ సీఎంగా బ్రాహ్మణ వర్గానికి అవకాశం కల్పించింది.

Tags:    
Advertisement

Similar News