బెంగళూరుకు రోజుకు 50 కోట్ల లీటర్ల నీటికొరత
నగరానికి నీటి కొరత తీర్చేందుకు చుట్టుపక్కల పల్లెలు, గ్రామాల నుంచి, నదుల నుంచి ఎంతో కొంత నీటిని తీసుకొచ్చి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
కర్నాటక రాజధాని, దేశ ఐటీ క్యాపిటల్ బెంగళూరులో జనం నీటికోసం కటకటలాడిపోతున్నారు. ఇంకా ఎండలు ముదరకముందే అక్కడ నీటికి విపరీతమైన కొరత ఏర్పడింది. ఏకంగా రోజుకు 50 కోట్ల లీటర్ల నీరు కొరత పడుతోందని సాక్షాత్తూ సీఎం సిద్ధరామయ్య ప్రకటించడం పరిస్థితి తీవ్రతను చాటిచెబుతోంది.
కోటీ 40 లక్షల మంది జనాభా
బెంగళూరు జనాభా కోటీ 40 లక్షలు దాటింది. ఇక శివారు ప్రాంతాల్లో ఉండేవారు కూడా కలిస్తే ఇది కోటిన్నరపైనే ఉంటుందని అంచనా. ఇంతమందికి నీటిని అందించేది ప్రధానంగా బోరుబావులే. బెంగళూరులో మొత్తం 14వేల బోర్‌వెల్స్ ఉంటే ఇందులో 6,900 అంటే దాదాపు సగం ఎండిపోయాయి. దీంతో రోజువారీ అవసరమైన 2,600 మిలియన్ లీటర్స్ పర్ డే (ఎంఎల్‌డీ)లో దాదాపు 50 ఎంఎల్‌డీకి కోత పడింది. ఇది 50 కోట్ల లీటర్లు.
పొదుపు పాటించండి
నగరానికి నీటి కొరత తీర్చేందుకు చుట్టుపక్కల పల్లెలు, గ్రామాల నుంచి, నదుల నుంచి ఎంతో కొంత నీటిని తీసుకొచ్చి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం పాల ట్యాంకర్లతో సహాఅన్ని ప్రైవేట్ ట్యాంకర్లను కూడా వాడుకోవాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. కావేరి ఫైవ్ ప్రాజెక్టు జూన్‌లో ప్రారంభమైతే ఈ కష్టాలు చాలా వరకు తీరతాయని, అప్పటి వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు.