మోదీ బండారం.. ఆస్ట్రేలియాలో బట్టబయలు

ఆస్ట్రేలియాలో భారత ప్రధాని మోదీ పర్యటన రోజే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన సంచలనంగా మారుతోంది.

Advertisement
Update:2023-05-24 06:56 IST

గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్ లో నిషేధించి చంకలు గుద్దుకుంది మోదీ ప్రభుత్వం. ఆ డాక్యుమెంటరీని సోషల్ మీడియాలో కూడా లేకుండా ఉక్కుపాదం మోపింది. ఎవరైనా బహిరంగ ప్రదర్శనకు సిద్ధపడితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించింది. ఇదీ ఇక్కడి పరిస్థితి. భారత ప్రజల కళ్లకు గంతలు కట్టాలనుకుంటున్నారు సరే, విదేశాల్లో ఉన్నవారిని అలా మోసం చేయలేరు కదా, అందుకే ఆస్ట్రేలియాలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. విశేషం ఏంటంటే.. ఈ రోజు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తో భారత ప్రధాని మోదీ సమావేశమవుతుండగా.. సాయంత్రం కాన్ బెర్రాలోని పార్లమెంట్ హౌస్ వేదికగా బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మోదీ పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉంది.

మోదీ విదేశీ పర్యటనల్లో భాగంగా ఫలానా దేశాధ్యక్షుడు మా మోదీ కాళ్లకు మొక్కారు, ఫలానా దేశంవారు ఘన స్వాగతం పలికారు, ఫలానా దేశ ప్రతినిధులు కరతాళ ధ్వనులతో మోదీ ఘనత కీర్తించారంటూ ఇక్కడి భక్తులు భజనలు మొదలు పెట్టారు. అదే భక్తుల నోటికి ఆస్ట్రేలియా తాళం వేస్తోంది. మోదీ పర్యటన ఉందని తెలిసే అక్కడి చట్టసభల సభ్యులు, మానవ హక్కుల కార్యకర్తలు ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. మోదీ పర్యటన రోజే ఆయన పరువు తీసే కార్యక్రమం పెట్టారు.

2002 గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్ర గురించి బీబీసీ రూపొందించిన రెండు భాగాల డాక్యుమెంటరీ భారత్ లో ఎంత అలజడి రేపిందో అందరికీ తెలుసు. ఆ డాక్యుమెంటరీని భారత్ లో ప్రదర్శించకపోయినా మోదీ ప్రభుత్వం భుజాలు తడుముకుంది. దానిపై నిషేధం విధించింది. ప్రైవేట్ స్క్రీనింగ్ లను కూడా అడ్డుకుంది, సోషల్ మీడియా లింకుల్ని తొలగించింది. బీబీసీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేంద్ర మంత్రులు. ఆ తర్వాత ఢిల్లీలోని బీబీసీ ఆఫీస్ పై ఐటీ దాడులు మరింత సంచలనంగా మారాయి. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు కానీ, ఆరోపణల మాత్రం చేయగలిగారు, వాటిని బీబీసీ ఖండించింది కూడా.

భారత్ తో స్నేహం ఉంది కానీ..

భారత్ తో ఆస్ట్రేలియాకు బలమైన స్నేహం ఉంది కానీ, అది సత్యానికి సంబంధించినది మాత్రమేనని అంటున్నారు గ్రీన్ సెనెటర్ షూబ్రిడ్జ్. ఆస్ట్రేలియాలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించిన తర్వాత దీనిపై కాన్ బెర్రా పార్లమెంట్ హౌస్ లో చర్చను నిర్వహించబోతున్నారు. భారత్‌లో మానవ హక్కులు దిగజారిపోతున్నాయని ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఏర్పాట్లు చేసిన బృందం ఆవేదన వ్యక్తం చేసింది. మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ, నానాటికీ దిగజారిపోతున్నాయని ఆరోపించారు. బీబీసీ డాక్యుమెంటరీని భారత్ లో చూపించే పరిస్థితి లేదు కానీ, ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉన్న ఆస్ట్రేలియాలో ఈ ప్రదర్శన ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. భారత్ లో హిందుత్వ సంస్థలను రెచ్చగొట్టి, వాటికి నిధులు సమకూర్చి, మతకల్లోలాలు సృష్టించే వారికి కొన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా ఉంటున్నాయని, రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని అంటున్నారు ఈ ప్రదర్శన నిర్వాహకులు.

మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన వ్యవహారం ఇప్పుడు భారత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆస్ట్రేలియాలో ప్రధాని పర్యటన రోజే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన సంచలనంగా మారుతోంది. భారత్ లో కేంద్ర మంత్రులు కానీ, అధికారులు కానీ ఈ ప్రదర్శన వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. భారత్ లో నిషేధం విధించినట్టు, ఆస్ట్రేలియాపై రంకెలేస్తామంటే కుదరదు కాబట్టి, అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసుకోలేక ప్రదర్శన విషయం తెలిసినా సైలెంట్ గా ఉన్నారు. 

Tags:    
Advertisement

Similar News