హిందూ యువతులతో బీచ్ కి.. ముస్లిం విద్యార్థులపై దాడి

గురువారం సాయంత్రం వారు సరదాగా గడిపేందుకు సోమేశ్వర్ బీచ్ కు వచ్చారు. ఆ సమయంలో అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. హిందూ యువతులతో ముస్లిం యువకులు తిరుగుతుండడం గమనించారు.

Advertisement
Update:2023-06-02 10:48 IST

హిందూ యువతులతో కలిసి బీచ్ కు వచ్చారని ముస్లిం యువకులపై దాడి చేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రం మంగళూరులో జరిగింది. అక్కడి సోమేశ్వర్ బీచ్ కి ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు రాగా యువకులు ముస్లింలు కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. కేరళకు చెందిన ఆరుగురు వైద్య విద్యార్థులు కర్ణాటకలోని మంగళూరును సందర్శించేందుకు వచ్చారు. వారిలో ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

గురువారం సాయంత్రం వారు సరదాగా గడిపేందుకు సోమేశ్వర్ బీచ్ కు వచ్చారు. ఆ సమయంలో అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. హిందూ యువతులతో ముస్లిం యువకులు తిరుగుతుండడం గమనించారు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు యువతీ యువకుల వద్దకు వచ్చి తాము పోలీసులమని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారు..? అని ప్రశ్నించి పేర్లు, వారి వివరాలు ఆరా తీశారు. హిందూ యువతులతో బీచ్ కు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు.

ఈ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు యువకులపై దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. దీనిపై మంగళూరు పోలీస్ కమిషనర్ కుల్దీప్ కుమార్ జైన్ మాట్లాడుతూ విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకోవడం కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హిందూ యువతులతో బీచ్ కు వచ్చారన్న కారణంతో ముస్లిం విద్యార్థులపై దాడి జరపడం తీవ్ర కలకలం రేపుతోంది.

Tags:    
Advertisement

Similar News