ఢిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణ స్వీకారం

కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా

Advertisement
Update:2024-09-21 17:31 IST

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్‌ నాయకులు ఆతిశీ మర్లేనా శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్ వినయ్‌ కుమార్‌ సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ప్రజల వద్దకే వెళ్లి తన నిర్దోశిత్వాన్ని నిరూపించుకుంటానని ఆప్‌ చీఫ్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ శపథం చేశారు. ఈక్రమంలోనే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభ పక్షనేతగా ఆతిశీ మర్లేనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఆతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుష్మా స్వరాజ్‌, షీలా దీక్షిత్‌ తర్వాత ఢిల్లీకి మూడో మహిళ ముఖ్యమంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. దేశంలో ఆమె 17వ మహిళా ముఖ్యమంత్రి. కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో ఆతిశీ ఆర్థిక, విద్య, రెవెన్యూ, పీడబ్ల్యూడీ సహా పలు కీలక పోర్ట్‌ ఫోలియోలకు మంత్రిగా పని చేశారు. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్‌ ఆప్‌ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి, క్రికెటర్‌ గౌతమ్‌ గంబీర్‌ చేతిలో ఓడిపోయారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిపొంది మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. మనీశ్‌ సిసోడియా రాజీనామా తర్వాత ఆమెను కేజ్రీవాల్‌ కేబినెట్‌ లోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే ఆతిశీ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆతిశీతో పాటు గోపాల్‌ రాజ్‌, కైలాశ్‌ గహ్లోత్‌, సౌరబ్‌ భరద్వాజ్‌, ఇమ్రాన్‌ హసన్‌, ముకేశ్‌ అహ్లావత్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.




 


Tags:    
Advertisement

Similar News