వజ్రోత్సవం స్పెషల్.. అస్సోంలో పాత కేసులన్నీ మాఫీ..

భారత స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ అస్సోంలో చిన్న చిన్న కేసులు ఎదుర్కొంటున్నవారందరికీ ఊరట కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ.

Advertisement
Update:2022-08-16 08:13 IST

రుణమాఫీ పేరుతో లక్షలాది రైతులకు మేలు చేసే ప్రభుత్వాలను చూశాం, కానీ అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాత్రం పోలీస్ కేసుల్నే మాఫీ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా లక్ష కేసుల్ని ఒక్క కలంపోటుతో మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని కొంతమంది సమర్థిస్తుండగా, మరికొందరు న్యాయస్థానాల పరిధిలో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ అస్సోంలో చిన్న చిన్న కేసులు ఎదుర్కొంటున్నవారందరికీ ఊరట కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ.

సీఎం లాజిక్ ఏంటంటే..?

విచారణ లేకుండానే కేసుల్ని కొట్టేస్తున్నారంటే, తప్పు చేస్తున్నవారిని వదిలేస్తున్నట్టే లెక్క. అయితే అదే సమయంలో సీఎం బిశ్వశర్మ ఇక్కడో లాజిక్ చెబుతున్నారు. కోర్డుల్లో పని ఒత్తిడిని తగ్గించేందుకు పెద్ద కేసుల్లో సత్వర న్యాయం జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న కేసుల్ని తమ ప్రభుత్వం ఉపసంహరించుకుంటోందని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా పోస్టింగ్ లపై పెట్టిన కేసులు, ఇతర మైనర్ కేసుల్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు.

అస్సోంలో కిందిస్థాయి కోర్టుల్లో దాదాపు 4లక్షలకు పైగా కేసులు పెండింగ్‌ లో ఉన్నాయన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. వీటిలో ఈ ఏడాది ఆగస్టు 14 అర్ధరాత్రి వరకు నమోదైన లక్ష మైనర్‌ కేసుల్ని ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం వెల్లడించారు. ఈ నిర్ణయంతో అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాల విచారణపై దృష్టిసారించేందుకు న్యాయవ్యవస్థకు వీలు ఏర్పడుతుందన్నారు. న్యాయవాదులు అందుబాటులో లేక ఎవరైనా అమాయకులు జైళ్లలో మగ్గుతుంటే అలాంటి వాళ్లను తక్షణమే విడుదల చేస్తామని కూడా చెప్పారు సీఎం.

Tags:    
Advertisement

Similar News