జీ-20 అతిథులకు అరకు కాఫీ గిఫ్ట్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?
ప్రపంచంలోనే అత్యుత్తమ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్‌కు ఉందనడానికి అరకు కాఫీ చక్కటి ఉదాహరణ అని చెప్పారు. బోర్డ్ ఆఫ్ అరకు ఒరిజినల్స్ ఛైర్మన్‌గా ఇది తనకు ఎంతో గర్వకారణమని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో జీ-20 సదస్సు ముగిసిన తర్వాత.. సదస్సులో పాల్గొన్న విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన బహుమతులను ప్రశంసించారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. ప్రత్యేకంగా అరకు కాఫీని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్‌కు ఉందనడానికి అరకు కాఫీ చక్కటి ఉదాహరణ అని చెప్పారు. బోర్డ్ ఆఫ్ అరకు ఒరిజినల్స్ ఛైర్మన్‌గా ఇది తనకు ఎంతో గర్వకారణమని చెప్పుకొచ్చారు.
ఇక అరకు కాఫీ చాలా స్పెషల్. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి టెర్రోయిర్-మ్యాప్డ్ కాఫీ. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయలో సేంద్రీయ పద్ధతిలో ఈ కాఫీ గింజలను సాగు చేస్తారు. ఈ ప్రాంతం కాఫీ తోటల సాగుకు అత్యంత అనువైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అరకు కాఫీ గింజలు ప్రత్యేకమైన ఆకృతిలో అరుదైన సువాసనను కలిగి ఉంటాయని ANI ట్వీట్ చేసింది. వీటి రుచి కూడా ఎంతో ప్రత్యేకమని స్పష్టం చేసింది.
అరకు కాఫీని ఎక్కువగా గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తారు. తూర్పు కనుమలలో ఉన్న అందమైన అరకు లోయలోని గిరిజన రైతులకు సహకారం అందించానికి అరకు ఒరిజినల్స్‌ను ఏపీ ప్రభుత్వం 2008లో స్థాపించింది. అరకు కాఫీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా ఈ ప్రయత్నం చేసింది ఏపీ సర్కార్. అరకు కాఫీ ప్రస్తుతం 9 దేశాల్లో అందుబాటులో ఉంది. పారిస్, బెంగళూరుల్లో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లు కూడా ఉన్నాయి.
ఇక జీ-20 ప్రతినిధులకు ఇచ్చిన గిఫ్ట్ హాంపర్‌లో భారతదేశ సంప్రదాయం, కళలను ప్రతిభింబించే విధంగా హస్తకళలు, ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో చేతితో తయారు చేసిన సందూక్, రెడ్ గోల్డ్, షాంపైన్ ఆఫ్ టీ, మడ అడవుల నుంచి సేకరించిన తేనె, పష్మినా శాలువా, జిఘ్రానా ఇత్తర్, ఖాదీ కండువా, స్మారక స్టాంపులు, ఇతర నాణేలు ఉన్నాయి.