అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలి
సంవిదాన్ బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వగ్రామం మౌ కంటోన్మెంట్‌లో నిర్వహించిన సంవిదాన్ బచావో ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానిస్తోందన్నారు. విద్యావ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోందని, జీఎస్టీ పేరుతో ప్రజలను లూటీ చేస్తుందన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కుల గణన చేస్తున్నామని, తద్వారా ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో తెలుస్తుందన్నారు. దేశ జనాభాలో 90 శాతం మంది పేదలు, దళితులు, బడుగు బలహీనవర్గాల వారే ఉన్నారని తెలిపారు. ఓబీసీలకు రిజర్వేషన్‌ల అమలులో అన్యాయం జరుగుతుందన్నారు.
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర : మల్లికార్జున ఖర్గే
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని.. అణగారిన వర్గాల హక్కులపై దాడి చేస్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని.. పన్నుల పేరుతో పేదల సొమ్ము దోచుకుంటోందన్నారు. కేంద్రం కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడతామన్నారు.