ఢిల్లీలో మరో దారుణం : విద్యార్థినిపై యాసిడ్ దాడి

పోలీసులు ఆసుపత్రికి చేరుకొని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. బాలిక ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో అందులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Update:2022-12-14 15:42 IST

ఢిల్లీలో దారుణ సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. శ్రద్ధావాకర్ హత్య ఘటన వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు ఇటువంటి ఘటనలు నిత్యం అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో 17 ఏళ్ల విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థిని ముఖం పూర్తిగా కాలిపోయింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని సఫ్ధర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.

ఇవాళ ఉదయం ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలిక, 13 ఏళ్ల తన సోదరితో కలసి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు 17 ఏళ్ల బాలికపై యాసిడ్ తో దాడి చేశారు. అనంతరం వారు అక్కడినుంచి పరారయ్యారు. యాసిడ్ దాడిలో ముఖం అంతా కాలిపోయి తీవ్రంగా గాయపడ్డ బాలికను సమీపంలోని సఫ్ధర్ జంగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు ఆసుపత్రికి చేరుకొని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. బాలిక ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో అందులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులకు సూచించారు. కాగా బాలికపై యాసిడ్ దాడి చేసిన వ్యక్తి మైనర్ అని సమాచారం. బాధితురాలితో అతడికి ముందే పరిచయం ఉందా..? ఉంటే అతడు ఎందుకు యాసిడ్ తో దాడి చేయాల్సి వచ్చింది..? తదితర కోణాల్లో ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News