మనాలీని కప్పేసిన మంచు దుప్పటి

రోహ్‌తంగ్‌లోని సోలాంగ్‌, అటల్‌ టన్నెల్‌ మధ్య 1000పైగా చిక్కుకుపోయిన వాహనాలు

Advertisement
Update:2024-12-24 09:17 IST

చలి తీవ్రతతో ఉత్తరభారతం గజగజా వణికిపోతున్నది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలీపై మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం భారీగా ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్‌తంగ్‌లోని సోలాంగ్‌, అటల్‌ టన్నెల్‌ మధ్య సోమవారం రాత్రి తర్వాత సుమారు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.

కొన్నిరోజులుగా మంచు భారీగా పడుతుండటంతో మనాలీకి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచి వాతావరణ అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొన్నది. దీంతో వాహనాలు ముందుకు కదలలేక భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 700 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అటల్‌ టన్నెల్‌ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అటు రాజధాని సిమ్లాలోనూ మంచు పడుతున్నది. హిమపాతం కారణంగా రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. క్రిస్మస్‌, కొత్త సంవత్సరం నేపథ్యంలో ఏటా డిసెంబర్‌ చివరి వారంలో మనాలీకి పర్యాటకుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. గత కొన్నిరోజులుగా వేల సంఖ్యలో వాహనాలు ఆ ప్రాంతానికి వచ్చాయని అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News