రూ. 20 కోసం 22 ఏళ్లు పోరాటం చేసిన లాయర్

వేలు.. లక్షల రూపాయల మోసం జరిగితేనే కోర్టులు చుట్టూ ఎవరు తిరుగుతారని మధ్యవర్తుల ద్వారా సెటిల్ చేసుకోవడమో.. లేదంటే వదిలేసుకోవడమే చేసే ఈ రోజుల్లో.. కేవలం రూ. 20 కోసం 22 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగాడంటే నమ్మగలమా.?

Advertisement
Update:2022-08-14 10:42 IST

వేలు.. లక్షల రూపాయల మోసం జరిగితేనే కోర్టులు చుట్టూ ఎవరు తిరుగుతారని మధ్యవర్తుల ద్వారా సెటిల్ చేసుకోవడమో.. లేదంటే వదిలేసుకోవడమే చేసే ఈ రోజుల్లో.. కేవలం రూ. 20 కోసం 22 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగాడంటే నమ్మగలమా.? తనకు రావల్సింది కేవలం 20 రూపాయలే కదా అని ఆ వ్యక్తి వదిలేయలేదు. తనకు జరిగిన మోసాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి.. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి అవిశ్రాంతంగా పోరాడి గెలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లాయర్ తుంగ్‌నాథ్ చతుర్వేది అనే లాయర్ 1999 డిసెంబర్ 25న మొరాదాబాద్ వెళ్లడానికి మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. రైల్వే స్టేషన్ బుకింగ్ క్లర్క్ వద్దకు వెళ్లి రెండు టికెట్లు కావాలని రూ.100 నోటు ఇచ్చాడు. ఒక్కొక్కరికి రూ. 35 టికెట్ కావడంతో.. రూ. 70 చార్జీ అవుతుంది. అయితే బుకింగ్ క్లర్క్ మాత్రం తుంగ్‌నాథ్ చేతిలో రెండు టికెట్లతో పాటు రూ. 10 చేతిలో పెట్టాడు. అప్పట్లో కంప్యూటర్ బుకింగ్ లేకపోవడంతో చేతితో రాసిన టికెట్లు ఇచ్చాడు. కౌంటర్ నుంచి పక్కకు వచ్చిన తర్వాత తనకు రూ. 20 తక్కువగా వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే బుకింగ్ క్లర్క్‌కు ఈ విషయం చెప్పినా మిగిలిన రూ. 20 ఇవ్వడానికి నిరాకరించాడు.

తనకు రూ. 20 నష్టం జరగడాన్ని జీర్ణించుకోలేని లాయర్ తుంగ్‌నాథ్ వెంటనే జిల్లా కన్స్యూమర్ ఫోరమ్‌లో కేసు వేశాడు. నార్త్ఈస్ట్ రైల్వేస్ (గొరఖ్‌పూర్), బుకింగ్ క్లర్క్‌తో పాటు మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌ను ప్రతివాదులుగా చేర్చాడు. ఇక అప్పటి నుంచి న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఎంతో మంది రూ. 20 కోసం ఈ న్యాయపోరాటం అవసరమా అని అతడిని నిరుత్సాహపరిచారు. గత 22 ఏళ్లలో 100కు పైగా విచారణలకు హాజరయ్యాడు. కానీ ఏ రోజూ తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. చివరకు ఈ ఏడాది అగస్టు 5న తుంగ్‌నాథ్ చతుర్వేదికి అనుకూలంగా మధుర వినియోగదారుల ఫోరమ్ తీర్పు ఇచ్చింది.

లాయర్ తుంగ్‌నాథ్‌కు 12 శాతం వడ్డీతో రూ. 20 తిరిగి ఇవ్వాలని.. అంతే కాకుండా అతడికి జరిగిన ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడికి గాను రూ. 15వేలు జరినామాగా కట్టాలని.. దీంతో పాటు కోర్టు ఫీజులు కూడా చెల్లించాలని భారతీయ రైల్వేను ఆదేశిస్తూ మధుర డిస్ట్రిక్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రసల్ కమిషన్ ప్రెసిడెంట్ నవనీత్ కౌర్ తీర్పునిచ్చారు. ఒక నెలలోపు కనుక చెల్లించకపోతే వడ్డీని 15 శాతానికి పెంచుతామని కూడా పేర్కొన్నది.

44 ఏళ్ల వయసులో కేసు వేసిన తుంగ్‌నాథ్ చివరకు 66 ఏళ్ల వయసులో గెలిచాడు. తాను ఈ కేసు గెలుస్తానని ముందే తెలుసని తుంగ్‌నాథ్ పేర్కొన్నారు. తాను ఈ పోరాటం చేసింది డబ్బు కోసం కాదని.. కేవలం న్యాయం గెలవాలనేదే తన ఆకాంక్ష అని వివరించారు. ఇండియాలోని వినియోగదారుల ఫోరమ్స్‌ను ఆశ్రయిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. అయితే వేలాది కేసులు పెండింగ్‌లో ఉండటంతో వినియోగదారులకు న్యాయం జరగడానికి చాలా సమయం పడుతోంది. అందుకే చాలా మంది వీటిని ఆశ్రయించడం లేదు. ఒకటి రెండు హియరింగ్స్‌లో కూడా తేల్చేయాల్సిన కేసులను కూడా ఏళ్ల పాటు సాగదీస్తుండటంతో వినియోగదారులు ఈ ఫోరమ్స్‌ను పెద్దగా ఆశ్రయించడం లేదన్నారు.

తాను కేసు వేసిన సమయంలో పత్రికలు ఇలాంటి వార్తలను పట్టించుకునేవి కావు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ కూడా లేదు. అందుకే తన కేసు పెద్దగా హైలైట్ కాలేదు. అదే ఇప్పుడైతే నెల రోజుల్లో కేసు పూర్తయ్యేదని తుంగ్‌నాథ్ పేర్కొన్నారు. తాను ఒక లాయర్‌ను కాబట్టి అడ్వొకేట్ ఫీజు, కోర్టుకు వెళ్లాల్సిన ప్రయాణపు ఖర్చులు కలసి వచ్చాయి. సామాన్యులకు అయితే ఇవి చాలా భారమే. ఇక తాను వెచ్చించిన సమయం, శక్తిని వెలకట్టడం మాత్రం సాధ్యం కాదని అన్నారు.

ఈ కేసును పోరాడుతున్న సమయంలో ఇండియన్ రైల్వేస్ తనకు ఓ నోటీసు పంపిందని పేర్కొన్నాడు. ఈ కేసు వినియోగదారుల ఫోరమ్ పరిధిలోకి రాదని.. వెంటనే రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని పేర్కొన్నట్లు తెలిపాడు. అయితే 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ఆధారంగా వినియోగదారుల ఫోరమ్‌లోనే తాను పోరాటం కొనసాగించానని తెలిపారు. ఇది తన విజయం కాదని.. వినియోగదారులందరి విజయమని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News