ఆడపిల్ల పుడితే రూ.50వేలు ఫిక్స్ డ్ డిపాజిట్
రాజకీయ పార్టీలన్నిటికీ ఇటీవల మహిళల ఓట్లపై నమ్మకం కుదిరింది. మహిళలు ఆదరిస్తే కచ్చితంగా గెలిచి తీరతామన్న భావన నాయకులలో ఉంది.
రాజకీయ పార్టీలన్నిటికీ ఇటీవల మహిళల ఓట్లపై నమ్మకం కుదిరింది. మహిళలు ఆదరిస్తే కచ్చితంగా గెలిచి తీరతామన్న భావన నాయకులలో ఉంది. కర్నాటకలో ఇదే రుజువైంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే పథకం అక్కడ విజయవంతమైంది. అమలు చేయడానికి ప్రభుత్వం తిప్పలు పడటం వేరే విషయం. ఏపీలో కూడా దాదాపు అలాంటి పథకాలతోనే టీడీపీ కూడా మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మహాశక్తి పేరుతో మహిళలకు వరాలు ప్రకటించింది. ఈ క్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఆడపిల్లలు పుడితే వారి ఖాతాల్లో రూ.50వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించింది. ఆ పథకాన్ని అమలులో పెట్టింది.
పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఇటీవలే అసెంబ్లీలో ఈ పథకం గురించి ప్రకటించారు, ఇప్పుడు దీన్ని అమలులోకి తెచ్చారు. ఆడపిల్లలు పుడితే వారి పేరిట బ్యాంకు ఖాతాలు ప్రారంభించి అందులో రూ.50వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. కనీసం ఇలాగయినా భ్రూణ హత్యలు ఆగుతాయని ఆయన ఆకాంక్షించారు. ఆడపిల్లలపై వివక్ష తొలగిపోతుందన్నారు. తాజాగా ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం 38మంది మహిళలకు ఫిక్స్ డ్ డిపాజిట్ పత్రాలు అందించారు. వారి పిల్లలపై రూ.50వేలు బ్యాంకుల్లో జమ చేసినట్టు తెలిపారు.
పుదుచ్చేరిలో కూడా మహిళల పేరిట అనేక పథకాలు అమలులో ఉన్నాయి. పేద మహిళలకు నెల నెలా రూ.1000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. దాదాపు 13వేలమంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇటీవల కొత్తగా ఆర్థిక సాయం మంజూరైనవారికి గుర్తింపు కార్డులు అందజేశారు సీఎం రంగస్వామి. బాలికా శిశు రక్షణ పేరుతో ఆడ పిల్లల పేరుతో రూ.50వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసే పథకాన్ని అదే రోజు కూడా ప్రారంభించారు.