15 మందికి మరణశిక్ష – కేరళ కోర్టు సంచలన తీర్పు
కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక హత్య కేసులో 15 మందికి మరణశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది.
కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక హత్య కేసులో 15 మందికి మరణశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. దోషులుగా తేలినవారంతా నిషేధిత పీఎఫ్‌ఎస్‌ఐ సంస్థకు చెందినవారు. రెండేళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన బీజేపీ నాయకుడి హత్య కేసులో విచారణ చేపట్టిన కేరళ అలప్పుళ కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
కేరళ చరిత్రలోనే తొలిసారి...
దోషులు అత్యంత క్రూరంగా హత్యకు పాల్పడ్డారని భావించిన ధర్మాసనం ఏకంగా 15 మందికి ఒకేసారి మరణశిక్ష విధించడం గమనార్హం. కేరళ చరిత్రలోనే ఇలాంటి తొలిసారి కావడం విశేషం. ఒక కేసులో ఇంత ఎక్కువమందికి మరణశిక్ష విధించిన పరిస్థితి గతంలో ఎప్పుడూ చోటుచేసుకోలేదు. ఇక దోషులుగా నిర్ధారణ అయినవారిలో 8 మందిపై హత్య అభియోగాలు, మిగిలినవారిపై కుట్ర ఆరోపణలు రుజువైనట్టు న్యాయస్థానం తీర్పులో భాగంగా వెల్లడించింది.
చంపింది ఇలా...
బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ను 2021 డిసెంబరు 19న అలప్పుళలో హత్య చేశారు. పీఎఫ్‌ఎస్‌ఐ, ఎసీపీఐ కార్యకర్తలు ఆయన ఇంట్లోకి చొరబడి హతమార్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు.. ఈ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారించింది. ఆ ఏడాది డిసెంబర్ 18న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) నాయకుడు కేఎస్ షాన్ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముఠా చంపేసింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే రంజిత్ హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.
శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్...
బీజేపీ నేతను హతమార్చిన వారంతా శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ అని, ఆయన్ని ఆయన కుటుంబం కళ్లెదుటే అతి దారుణంగా చంపేశారని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. అత్యంత క్రూరమైన నేరంగా దీన్ని పరిగణించి దోషులకు గరిష్ఠ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. వారి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.