ఈవీఎంల కొనుగోలుకు రూ.1300 కోట్లు

ఈవీఎంలతోపాటు కొత్తగా రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం)లను కూడా తీసుకొస్తామంటున్నారు. ఈ దశలో ఇప్పుడు పాత వాటి రిపేర్లకు, కొత్తవాటి కొనుగోళ్లకు కేంద్రం 1300 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

Advertisement
Update:2023-01-19 11:08 IST

ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే మూడు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల పండగకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండనే ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈవీఎంలు సరిపోవు. అందులోనూ కొన్ని పాడైపోయాయి, మరికొన్నిటికి రిపేర్లు చేయాల్సి ఉంది. దీనికోసం కేంద్ర కేబినెట్ బడ్జెట్ విడుదల చేసింది. 1300 కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

2004నుంచి భారత్ లో ఈవీఎంల వాడకం జోరందుకుంది. ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నా.. బ్యాలెట్ బాక్స్ లకు పూర్తిగా మంగళం పాడేశారు. ఈవీఎంలతోపాటు కొత్తగా రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం)లను కూడా తీసుకొస్తామంటున్నారు. ఈ దశలో ఇప్పుడు పాత వాటి రిపేర్లకు, కొత్తవాటి కొనుగోళ్లకు కేంద్రం 1300 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

భారత్ లో జరిగే ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషన్లను ప్రధానంగా రెండు కంపెనీలు తయారు చేస్తున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ఈవీఎంల తయారీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాయి. ఈ రెండు సంస్థలనుంచే కొత్త ఈవీఎంలను కూడా కొనుగోలు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈవీఎంల తయారీ సమయంలో వాటి ఖరీదు ఒక్కో యూనిట్ కి 17వేల రూపాయల వరకు ఉండేది.

ఈవీఎంలలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ ఉంటాయి. కొత్తగా వీటికి వీవీప్యాట్ మిషన్లు కూడా జత చేరాయి. ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా 2వేల ఓట్లు నమోదవుతాయి. సార్వత్రిక ఎన్నికలకోసం ఇప్పుడు ఎన్నికల కమిషన్ 1300 కోట్ల రూపాయలతో ఈవీఎంలను కొనుగోలు చేయబోతోంది.

Tags:    
Advertisement

Similar News