కాపీ కొట్టడంలో ఇద్దరూ.. ఇద్దరే.. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌పై ట్రోల్స్
టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్, తమన్ ఒక్కో సినిమా చేసేందుకు రూ. కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. అయినప్పటికీ వారు ఇలా కాపీ ట్యూన్స్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
దేవిశ్రీప్రసాద్, తమన్ టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తులు. దేవిశ్రీప్రసాద్ టీనేజ్‌లోనే మ్యూజిక్‌లో అద్భుతాలు సృష్టించి ఎన్నో మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. 20 ఏళ్లకే టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక తమన్ కూడా కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా అందిస్తాడనే గుర్తింపుతో పాటు కమర్షియల్ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తాడని పేరు తెచ్చుకున్నాడు.
అయితే ఈ ఇద్దరు సంగీత దర్శకులకు ట్యూన్స్ కాపీ కొడతారనే చెడ్డ పేరు ఉంది. ముఖ్యంగా తమన్‌పై తరచూ ట్యూన్స్ కాపీ కొడతాడనే విమర్శలు వస్తుంటాయి. తమిళ, హాలీవుడ్ చిత్రాలతో పాటు తన పాత ట్యూన్‌లను కూడా తానే కాపీ కొడుతూ తమన్ ప్రేక్షకులకు దొరికిపోతుంటాడు. కెరీర్ ఆరంభంలో ఊకదంపుడు మ్యూజిక్ కొడతాడని పేరు తెచ్చుకున్న తమన్ ఆ తర్వాత అలవైకుంఠపురముతో సినిమాతో చెడ్డపేరు పోగొట్టుకున్నాడు. ఆ సినిమాలోని సాంగ్స్ సంచలనం సృష్టించడంతో తమన్ పేరు మార్మోగిపోయింది.
అయితే కొద్ది రోజులుగా తమన్ కాపీ ట్యూన్స్ ఇస్తూ మళ్లీ దొరికిపోతున్నాడు. ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారువారిపాట సినిమాలో మ.. మ.. మహేశా అనే పాటకు తానే సంగీత దర్శకత్వం వహించిన సరైనోడు సినిమా నుంచి కాపీ కొట్టాడనే విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా తమన్ మ్యూజిక్ అందించిన వీరసింహారెడ్డి సినిమా నుంచి జై బాలయ్య అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల కాగా..అది ఒసేయ్ రాములమ్మ సినిమాలోని.. ఓ.. ఓ.. ఒసేయ్ రాములమ్మ ట్యూన్‌ను యథాతధంగా దించినట్లు ఉందనే విమర్శలు వస్తున్నాయి.
అలాగే మరొక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌పై కూడా ట్యూన్లు కాపీ కొడుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. అందులో ఊ..అంటావా మామ.. ఊ.. ఊ..అంటావా.. అనే స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ అయింది. అయితే ఆ పాట ట్యూన్‌ని ఓ తమిళ సినిమా నుంచి కాపీ కొట్టాడని విమర్శలు వచ్చాయి. తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి బాస్ పార్టీ అనే సాంగ్ విడుదల కాగా.. ఆ పాట కూడా దేవిశ్రీ కాపీ కొట్టాడని విమర్శలు వస్తున్నాయి. తమిళ్‌లో శింబు హీరోగా నటించిన ఓ పాత సినిమా నుంచి ఈ ట్యూన్ కాపీ కొట్టినట్లు ట్రోలింగ్ జరుగుతోంది.
టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్, తమన్ ఒక్కో సినిమా చేసేందుకు రూ. కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. అయినప్పటికీ వారు ఇలా కాపీ ట్యూన్స్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏ ఇంగ్లీష్ సినిమా నుంచో తమిళ సినిమా నుంచో ట్యూన్స్ కాపీ కొట్టినా ప్రేక్షకులు కనుక్కునేవారు కాదు. ప్రస్తుత ట్రెండ్‌లో అలాంటి ఆటలు అంత ఈజీగా సాగే పరిస్థితులు లేవు. ఏదైనా ఒక భాషలో ఒక పాట హిట్ అయితే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు వాటిని వింటున్నారు. అలా సక్సెస్ అయిన పాటలను కాపీ కొడితే మాత్రం వెంటనే పట్టేసుకుంటున్నారు. ఆధారాలతో సహా చూపుతున్నారు. ఇది గమనించి ఇప్పటికైనా దేవిశ్రీప్రసాద్, తమన్ సొంత బాణీలు అందించాల్సి ఉంది.